గద్వాల: జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం సంతోష్ నగర్ కాలనీలో నివసిస్తున్న సునీత కొన్ని రోజుల క్రితం తన వ్యవసాయ పొలం విక్రయించగా వచ్చిన నగదును ఇంటి బీరువాలో దాచుకున్నారు. వారం క్రితం కుటుంబ సభ్యులతో కలిసి పెద్దల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి వెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి చేరుకున్న సునీత ఇంటి తాళాలు పరిశీలించారు. గతంలో వేసిన తాళం, ఇప్పడు వేసిన తాళం వేరుగా ఉండటంతో..
అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా ఉండడం గమనించింది. బీరువాను పగులగొట్టి బీరువాలో దాచి ఉంచిన్న రూ.14లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించిన బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని గద్వాల సీఐ శ్రీనివాస్, టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్, క్లూస్‌టీం డ్వాగ్ స్కార్డ్ బృందాలు పరిశీలించారు. పట్టణ వీధిలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. ఈ సంఘటనతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.