Saturday, November 16, 2024

ప్రైవేట్ బస్సులో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ ః నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ భవానీ హోటల్ వద్ద ఆగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ సినిమా పక్కీలో చోరీకి గురైంది. 13 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను రెప్పపాటు కాలంలో దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే…ముంబయి నుంచి జగిత్యాల వెళ్తున్న వీనస్ ట్రావెల్ బస్సు ఆదివారం ఉదయం సారంగాపూర్‌లో ఆగింది. బస్సు ఎక్కిన జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు భవానీ హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి అందరితో పాటు బస్సు దిగాడు. ఆయన తన రెండు బ్యాగులను బస్సులోనే ఉంచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చాడు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు 13 లక్షల నగదు ఉన్న ఒక బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. తన బ్యాగ్ కనిపించకపోయేసరికి హన్మంత్ తోటి ప్రయాణికులను వాకబు చేశాడు. అయినా బ్యాగ్ దొరకకపోవడంతో లబోదిబో మన్నాడు. చివరికి ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చాడు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మొదట బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ బ్యాగు దొరకకపోవడంతో బస్సుతో పాటు ప్రయాణికులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. హన్మంతు రెండు బ్యాగులతో వ్యాపార నిమిత్తం 19 లక్షల నగదుతో జగిత్యాలకు వస్తున్నాడు. దుండగులు13 లక్షలు నగదు కలిగిన ఒక బ్యాగ్ మాత్రమే ఎత్తుకెళ్లారు. 6 లక్షల నగదు ఉన్న మరో బ్యాగ్ బస్సులోనే ఉంది. ముంబయిలో బస్సు ఎక్కే సమయంలోనే హన్మంతు నగదుకు సంబంధించిన సమాచారాన్ని బస్సు క్లీనర్‌కు సైతం చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే దాబా వద్ద ఆగి ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోకి వచ్చిన విషయం భవానీ హోటల్ వద్ద ఉన్న సిసి టివి ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. హన్మంత్ ముంబయి నుంచి బ్యాగ్‌లో భారీగా డబ్బు తీసుకువస్తున్న విషయం కచ్చితంగా తెలిసినవారే ఈ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో ఉన్న సిబ్బంది ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News