Sunday, January 19, 2025

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి పేరుతో భారీగా దోపిడీ

- Advertisement -
- Advertisement -

ఒక అధికారి దేవుడికే శఠగోపం పెట్టారు. దేవుడి పేరుతో ఆ అధికారి భారీగా దోచుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో త్వరలోనే దీనిపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే ఆ దేవుడి బ్రహోత్సవాల పేరుతో ఆ అధికారి నిధులు స్వాహా చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల పేరిట మూడు విదేశీ యాత్రలకు వెళ్లిన ఆ అధికారి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకపోవడంతో పాటు హుండీకి సీల్ లేకుండానే తీసుకెళ్లడం విశేషం. మామలుగా విదేశాల్లో అక్కడి తెలుగు ప్రజల కోసం బ్రహ్మోత్సవాలను నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు అక్కడి ఎన్‌ఆర్‌ఐలు ఇచ్చే విరాళాల విషయంలో కచ్చితంగా ప్రభుత్వానికి లెక్కలు చూపించాల్సి ఉంటుంది.

అయితే ఆ అధికారి దేవుడి పేరు చెప్పి మూడు దేశాలకు వెళ్లడంతో పాటు నిబంధనలు పాటించకుండా ఈ ఉత్సవాలను నిర్వహించడం విశేషం. ఇలా ఇష్టానుసారంగా ఆ అధికారి చేసిన నిర్వాకం వల్ల విరాళాల విషయంతో పాటు హుండీలో ఆయా దేశాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు వేసిన కానుకల్లోనూ భారీగా తేడా వచ్చినట్టుగా దేవాదాయ శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఆ అధికారి విదేశాలకు వెళ్లినప్పడు ఆ శాఖ కమిషనర్ సైతం ఇవన్నీ విషయాలను పట్టించుకోకుండా వారికి సెలవును మంజూరు చేసినట్టుగా తెలిసింది. ఆ అధికారితో కొందరు సిబ్బందికి సైతం లీవును ఆ శాఖ కమిషనర్ మంజూరు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటన్న విషయమై ప్రస్తుతం దేవాదాయ శాఖ విచారణ జరుపుతున్నట్టుగా తెలిసింది.

నిబంధనను అతిక్రమిస్తే సిసిఎల్‌ఏ రూల్స్ కింద చర్యలు
ప్రభుత్వ ఉద్యోగి మనం దేశం దాటి పోవాలనుకుంటే కచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తరువాతే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే సిసిఎల్‌ఏ రూల్స్ కింద దానిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇవన్నీ తెలిసినా ఆ అధికారి మాత్రం తన ఇష్టానుసారంగా దేవుడి పేరు చెప్పి విరాళాలను సేకరించడం, హుండీ విషయంలో లెక్కలు చెప్పకపోవడం తదితర విషయాలపై దేవాదాయ శాఖ ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ అధికారి తన సిబ్బందితో కలిసి విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరైతే వీరిని విదేశాలకు తీసుకెళ్లారో వారికి తెలియకుండా వేర్వేరు చోట్లకు ఆ అధికారి, తన సిబ్బందితో కలిసి వెళ్లినట్టుగా సమాచారం. ఇలా ఇష్టానుసారంగా వ్యవహారించడం వల్లే ప్రస్తుతం చాలామంది ఆ అధికారిపై ఫిర్యాదు చేశారని తెలిసింది.

దీంతోపాటు ఆ అధికారి యాదాద్రి అధికారిగా పనిచేసిన సమయంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనూ భక్తుల దర్శనానికి సంబంధించి ఇచ్చే టోకెన్‌ల విషయంలోనూ డూప్లికేట్‌వి జారీ చేయడం, లడ్డూల తయారీలోనూ నకిలీ రశీదులను ఇవ్వడం లాంటివి చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి విషయాలపై కూడా దేవాదాయ శాఖ ప్రస్తుతం విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఆ అధికారి హయాంలో పలు యంత్రాల కొనుగోళ్లతో పాటు టెండర్‌ల కేటాయింపుల్లోనూ జరిగిన అవినీతిపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇలా ఇష్టానుసారంగా ఆ అధికారి చేసిన అవినీతిపై ప్రభుత్వానికి ప్రస్తుతం ఫిర్యాదులు అందాయని, దీంతో దేవాదాయ శాఖ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. విచారణ అనంతరం ప్రస్తుతం ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News