Saturday, December 21, 2024

అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ నర్మగర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయనున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. తాను పోటీ చేయాలని నిర్ణయించుకుంటే తమకే ప్రాతినిధ్యం వహించాలని అమేథీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన ప్రకటించారు.

ప్రస్తుతం అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఆయన విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి గెలిచిన వ్యక్తి గాంధీ కుటుంబంపై దాడి చేయడానికే పరిమితమై పోయారని, ప్రజల బాగోగులు, నియోజవకర్గ అభివృద్ధి గురించి ఆమెకు ఏమీ పట్టదని వాద్రా వ్యాఖ్యానించారు. అనేక ఏళ్లుగా రాయబరేలి(సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం), అమేథీ, సుల్తాన్‌పూర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం పాటుపడిందని ఆయన చెప్పారు.

ప్రస్తుత ఎంపితో అమేథీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎన్నుకుని పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. తాము తప్పు చేశామని అమేథీ ప్రజలు భావించిన మరుక్షణం వారు గాంధీ కుటుంబాన్ని తిరిగి కోరుకుంటున్నారని అర్థమని ఆయన చెప్పారు. అమేథీ ప్రజలు తనను కోరుకుంటే కాంగ్రెస్‌కు గొప్ప విజయాన్ని అందచేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గానికి మే 20న ఐదవ దశలో పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News