త్వరలో నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ సేవలు
హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్‌కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి
45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్,
కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం
ఆయా విభాగాలకు రూ.153 కోట్లతో అత్యాధునిక పరికరాల మంజూరు
మంత్రి హరీశ్‌రావు
రూ.12 కోట్లతో నెలకొల్పిన అత్యాధునిక పరికరాలను ప్రారంభించిన ఆరోగ్యమంత్రి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు స్పష్టం చేశారు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎండోస్కోపి పరికరం, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఎంఆర్‌యు ల్యాబ్, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, వాటర్ ఎటిఎంలను మంత్రి హరీశ్‌రావు మంగళవారం ప్రారంభించారు. మంత్రి నిమ్స్ ఆస్పత్రిలో కలియ తిరుగుతూ అన్నింటిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్స్ విభాగాధిపతులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, నిమ్స్‌లో జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు సంబంధించిన సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను సవరించే అత్యాధునిక లాబ్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. రూ.12 కోట్లతో వివిధ మెడికల్ పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
అలాగే మల్టీ డిసిప్లనరీ రిసెర్చ్ యూనిట్‌ను, బోన్ డెన్సిటీవ్ మీటర్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదని, ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుదని చెప్పారు. తొలి సారిగా ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. అలాగే న్యుమాటిక్ వ్యూ సిస్టమ్‌ను తీసుకువచ్చామని, టెస్టింగ్ శాంపిల్స్‌ను అందులో పెడితే అది ల్యాబ్ లోకి వెళుతుందని, తిరిగి ఆ ఫలితాలు తెస్తుందని తెలిపారు. రూ.2.5 కోట్ల ఇది తీసుకువచ్చామని అన్నారు. అలాగే హైరిస్క్ ప్రెగ్నెంట్ పెషెంట్ల కోసం 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్‌ను నిమ్స్‌కు అనుబంధంగా తేవాలని నిర్ణయించామని చెప్పారు. కిడ్నీ, గుండె, హై బీపీతో వంటి సమస్యలతో బాధపడే హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.
అందుబాటులోకి 350 ఐసియు బెడ్లు
నిమ్స్‌లో గతంలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేదని, సిఎం కెసిఆర్ నిమ్స్‌ను బలోపేతం చేయాలని, మరో 200 పడకల ఐసీయూ బెడ్స్‌ను మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. ఈ 200 బెడ్స్ జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇవి పూర్తయితే పేద ప్రజలకు నిమ్స్‌లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గతంలో వెంటిలెటర్ దొరకాలంటే కష్టంగా ఉండేదని అన్నారు. వెంటలేటర్‌లు 89 మాత్రమే ఉన్నాయని, అదనంగా 120 వెంటిలేటర్లు కొత్తవి తెస్తున్నామని, మొత్తం 209 వెంటిలెటర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వచ్చే 45 రోజుల్లో వెంటిలెటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తేవాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆదేశించడం జరిగింది. నిమ్స్‌లో రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ విభాగాల నుంచి ఆధునిక పరికరాలు కావాలని విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఈ పరికరాలను రూ.153 కోట్లు అవసరమని పేర్కొన్నారు.
అందులో రోబోటిక్ సర్జరీ ముఖ్యమైనదని చెప్పారు. చేతి వేళ్లు వెళ్లలేని చోట రోబోటిక్ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేస్తారని, దీనికి రూ. 12 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో రోబోటిక్ సర్జరీ అందుబాటులో లేదని అన్నారు. నిమ్స్‌లో ఆయా పరికరాల కోసం రూ.154 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నామని, ఈ చికిత్స చేయించుకుని ఐదుగురు అక్కడ చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిమ్స్‌లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ పడకలు 8 ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే మరో నాలుగు ఆస్పత్రులు హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ కింద అల్వాల్, గడ్డి అన్నారం, టిమ్స్, ఛెస్ట్ ఆస్పత్రిలో నాలుగు వైపులా వెయ్యి పడకల ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
త్వరలో నిమ్స్‌లో రూ.5 భోజనం
జీహెచ్‌ఎంసీ వారిలో మాట్లాడి రోగుల సహాయకుల కోసం నిమ్స్‌లో రూ. 5 బోజనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రి బోజనం అందిస్తుందని, రోగుల సహాయకులు ఇబ్బంది పడకుండా రూ.5 భోజనం అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.చికిత్స పొందుతున్న వారిలో ఆరోగ్య శ్రీ కింద చేరిన వారికి భోజనం వస్తుందని, పేమెంట్ కింద చేరిన వారికి భోజనం రావడం లేద ని కొంతమంది రోగులు చెప్పారని, అందరికీ భోజనం పెట్టాలని నిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన 13 మంది విదేశీ ప్రయాణికులకు ఒమిక్రాన్ నెగెటివ్‌గా వచ్చిందని అన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలను పెంచుతున్నామని, రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు టీకా తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని, క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు దానిపైనే దృష్టి సారించారని చెప్పారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.