నేటినుంచి సహాయక చర్యల్లో
మరమనుషులు కంట్రోల్ రూమ్
ఏర్పాటు చేసుకున్న అన్వి సంస్థ
సొరంగంలో మరో మృతదేహం
ఆనవాలు
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధిః ఎస్‌ఎల్‌బిసిలో సొరంగం కూలిన ఘటనలో సహాయక చర్యలు చేపట్టడానికి రోబోల వినియోగం మొదలైంది. మంగళవారం ప్రయోగాత్మకంగా సొరంగంలో మాస్టర్ రోబోను అమర్చారు. దీంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ, కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అన్వి లీడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థకు చెందిన ప్రతినిధుల రూపంలో సహాయక చర్యలు చేపట్టడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
జీరో పాయింట్ మర మనుషులు వెళ్లి సహాయక చర్యలో పాల్గొనే పరిస్థితులు లేవు. మరో ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దన్న కారణంతో ప్రభుత్వం రోబోల వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 16 రోజులకు ఒక మృతదేహం లభించగా మరో ఏడుగురి కోసం అన్వేషణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. సహాయక చర్యలకు ఉబికి వస్తున్న నీటి ఊట టిబిఎం వెనుకభాగంలోని ఇనుప పైపుల రేకులు అడ్డంకిగా మారాయి. ఈ తరుణంలో అన్ని అవాంతరాలను ఛేదించుకుంటూ రోబోలు రెస్కూ ఆపరేషన్ ఎలా నిర్వహిస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరో మృతదేహం ఆనవాలు
ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో మంగళవారం మరో మృ తదేహాం ఆనవాళ్లను సహాయక బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. డి1 పాయింట్ వద్ద తవ్వకాలు జరుపుతున్న సహాయక బృందాలకు మనిషి వేలు కనిపించినట్లు తెలుస్తోంది. డి1 ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన విషయం విధితమే. సుమారు 3 మీటర్ల మేర మట్టి ఆ మృతదేహంపై పడి ఉండడం, ఆ పైన టిబిఎం మెషిన్ శకలాలు ఉండడంతో తవ్వకాలకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి వరకు డి1 పాయింట్ వద్ద గ్యాస్ ప్లాస్మా కట్టర్ల ద్వారా ఇనుప వ్యర్థాలు పనులు పూర్తయితే బుధవారం మధ్యాహ్నం వరకు మరో మృతదేహాన్ని వెలికితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.