ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఒక ఫుట్‌బాల్ మైదానంపై జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది లెబనీస్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను హెజ్బొల్లా తోసిపుచ్చింది. హమాస్‌పై దాడి తరువాత ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బొల్లా తరచు ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతోంది. తాజా దాడితో ఆ ప్రాంతంలో విస్తృత స్థాయిలో యుద్ధం జరుగుతుందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. హెజ్బొల్లా ‘ఈ దాడికి ఇంత వరకు ఎవరూ చెల్లించనంత భారీ మూల్యం చెల్లించుకుంటుంది’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.
గాజాలో యుద్ధానికి దారి తీసిన అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తరువాత ఇజ్రాయెలీ పౌరులపై జరిగిన మారణకాండ ఇది అని ఇజ్రాయెలీ మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరి పేర్కొన్నారు. ‘హెజ్బొల్లా అన్ని పరిధులను అతిక్రమించిందనడంలో ఏమాత్రం సండేహం లేదు. దానికి తగిన జవాబు తప్పదు’ అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఒక టివి చానెల్‌తో చెప్పారు. ‘ఉద్ధృత స్థాయిలో యుద్ధం జరిగే పరిస్థితులు తలెత్తుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. తమ గ్రూప్ ఈ దాడి జరపలేదని నిర్దంద్వంగా ఖండిస్తున్నదని హెజ్బొల్లా ముఖ్య అధికార ప్రతినిధి మొహమ్మద్ అఫీఫ్ ఒక వార్తా సంస్థతో చెప్పారు.