చైనా విదేశాంగశాఖ
బీజింగ్: ఈ వారాంతంలో భూమిపై పడనున్న రాకెట్ శకలాలపై చైనా మొదటిసారి స్పందించింది. రాకెట్ శకలాలు భూమిని తాకడానికి ముందే అవి వాతావరణంలోనే కాలిపోతాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అన్నారు. భూమిపై నష్టం కలిగించే అవకాశాలు దాదాపు లేవన్నారు. ఈమేరకు శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాకెట్ శకలాలు భూమివైపు దూసుకు రావడంపై సంబంధిత అధికారులు ఎప్పటికపుడు అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
తమ దేశం ఏప్రిల్ 29న విజయవంతంగా ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బి రాకెట్ నిర్దేశిత కక్షలోకి ప్రవేశించిన తర్వాత తిరుగు ప్రయాణంలో నియంత్రణ కోల్పోయిందని ఆయన తెలిపారు. అయితే, దాని శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయని, భూమిపై పడి నష్టం కలిగించే అవకాశాలు లేవని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు చైనా నిపుణులు ఆ శకలాలు అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడిపోతాయని అంటున్నారు.
కాగా, 22 టన్నుల బరువున్న రాకెట్ శకలాల్లో అధికభాగం భూమిపై జనావాసాల్లో పడ్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, శకలాలు జనావాసాలపై పడే అవకాశాలు అత్యల్పమని, ఓవేళ పడినా కలిగించే నష్టం తీవ్రంగా ఉండదని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్‌మెక్‌డోవెల్ అన్నారు. దానిని గురించి తానైతే ఒక్క సెకండ్ కూడా ఆందోళన చెందనని, తాను నిద్ర కోల్పోనంటూ మెక్‌డోవెల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8న చైనా రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అమెరికా అంతరిక్ష నిపుణులు అంచనా వేస్తున్నారు.