న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ఇస్రో) కొత్త చీఫ్‌గా రాకెట్ సైంటిస్ట్ ఎస్. సోమనాధ్ బుధవారం నియామకమయ్యారు. సెక్రటరీ ఆఫ్ డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఇంతవరకు ఈ పదవిని నిర్వహించిన కె.శివన్ పదవీకాలం ఈనెల 14 నాటికి పూర్తి కానున్నందున ఆయన స్థానంలో సోమనాధ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లు ఉంటారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి)డైరెక్టర్‌గా ఉంటున్నారు. అలాగే తిరువనంతపురం లోని డైరెక్టర్ ఆఫ్ లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పిఎస్‌సి)గా కూడా పదవిని నిర్వహించారు. వ్యోమనౌక రూపకల్పన లోను, ముఖ్యంగా సాంకేతిక వ్యవస్థలు, డిజైన్ రూపకల్పనలు, వ్యవస్థాపరమైన ప్రమాణాలు, పైరో టెక్నిక్స్‌లో కీలక పాత్ర వహించారు. సెమి క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి కార్యక్రమాల్లోను, రాకెట్ పరీక్షల్లోను పాలుపంచుకున్నారు.
చంద్రయాన్ 2 ల్యాండర్ క్రాఫ్ట్ ఇంజిన్లకు నిరంతరాయంగా ఇంధనం అందించే ప్రక్రియను , జిఎస్‌టి9 లోని విద్యుత్ చోదక వ్యవస్థను రూపొందించి విజయవంతంగా పనిచేసేలా నైపుణ్యం చూపించ గలిగారు. కమ్యూనికేషన్ శాటిలైట్లకు సంబంధించి జిఎస్‌టి ఎంకె 2(ఎఫ్‌ఒ 9),రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లకు సంబంధించి జిఎస్‌ఎటి6ఎ, పిఎస్‌ఎల్‌వి సి41 సామర్ధాలను పెంపొందించే పనుల్లో ఎక్కువగా నిమగ్నమయ్యారు. కేరళ లోని కొల్లాం లో టికెఎం ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తరువాత బెంగళూరు లోని ఎయిరో స్సేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1985 లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జాయిన్ అయ్యారు. 2010 జూన్ నుంచి 2014 వరకు జిఎస్‌ఎల్‌వి ఎంకె 3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
విఎస్‌ఎస్‌సి లోనే స్టక్చర్స్ ఎంటిటీ, ప్రొపల్సన్ అండ్ స్పేస్ ఆర్డినెన్స్ ఎంటిటీలో డెప్యూటీ డైరక్టర్లుగా 2014 నవంబర్ వరకు పనిచేశారు. స్వదేశీ క్రయోజెనిక్ దశలతో జిఎస్‌ఎల్‌వి మూడు విజయవంతమైన ప్రయోగాల్లోను, పిఎస్‌ఎల్‌వి 11 విజయవంతమైన ప్రయోగాల్లోను, ఎల్‌పిఎస్‌సి లిక్విడ్ స్టేజిల రూపకల్పన లోను, 15 విజయవంతమైన శాటిలైట్ ప్రయోగాల్లోను చోదకశక్తి వ్యవస్థల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. 2014 డిసెంబర్ 18 న సోమనాధ్ నేతృత్వంలో కేర్ మిషన్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించడమైంది. తిరువనంతపురం వలైమాల లో లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పిఎస్‌సి) డైరెక్టర్‌గా 2015 జూన్‌లో బాధ్యతలు చేపట్టారు. 2018 జనవరి వరకు ఆ పదవుల్లో రాణించారు.