బిసిసిఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
కార్యదర్శిగా జైషా, బోర్డులో ముగిసిన గంగూలీ ప్రస్థానం
ముంబై: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు బిసిసిఐ చీఫ్‌గా కొనసాగిన సౌరవ్ గంగూలీ స్థానంలో బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1983 వన్డే ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం బిన్నీ కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేగాక గతంలో బిసిసిఐ సెలెక్టర్‌గా కూడా బిన్నీ బాధ్యతలు నిర్వర్తించారు. భారత క్రికెట్ బోర్డు 36వ అధ్యక్షుడిగా బిన్నీ ఎంపికయ్యారు. మంగళవారం ముంబైలో నిర్వహించిన బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో బిన్నీని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక అధ్యక్ష పదవికి బిన్నీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డు అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో బిన్నీ కర్ణాటక క్రికెట్ సంఘం బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. చాలా కాలంగా బిన్నీ కర్ణాటక క్రికెట్ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలువురు ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికి తీయడంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక 1983 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టారు. ఈ మెగా టోర్నీలో బంతితో అసాధారణంగా రాణించారు. 18 వికెట్లు పడగొట్టి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక పలు మ్యాచుల్లో బ్యాట్‌తోనూ సత్తా చాటారు. ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగారు. ఇక సందీప్ పాటిల్ బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో బిన్నీ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, బిన్నీ త్వరలోనే బిసిసిఐ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. కొత్త అధ్యక్షుడిగా బిన్నీ ఎంపిక కావడంతో సౌరవ్ గంగూలీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
జైషా పదవి పదిలం
మరోవైపు బోర్డు కార్యదర్శిగా జై షా తన పదవిని నిలబెట్టుకున్నారు. జైషా మరోసారి కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఆయన్ను బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగించాలని సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీర్మానించారు.
దాదా ఆధిపత్యానికి తెర
ఇక భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన సౌరవ్ గంగూలీకి బిసిసిఐ సభ్యులు షాకిచ్చారు. గంగూలీని రెండోసారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు మెజారిటీ సభ్యులు అంగీకరించలేదు. దీంతో మరోసారి బిసిసిఐ పగ్గాలు చేపట్టాలని భావించిన గంగూలీకి నిరాశే మిగిలింది. కీలకమైన పదవిని కోల్పోవడంతో బిసిసిఐలో గంగూలీ ఆధిపత్యానికి తెరపడిందనే చెప్పాలి. గంగూలీ తప్పుకోవడంతో బిసిసిఐపై హోం శాఖ మంత్రి తనయుడు జైషాకు ఎదురు లేకుండా పోయింది. ఇకపై జైషా హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జైషా ఉత్సాహ విగ్రహంగానే కనిపించాడు. ఇక దాదా తప్పుకోవడంతో బిసిసిఐలో జైషాకు ఎదురు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.
Roger Binny Appointed as President of BCCI