లండన్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం సోమవారం తాజాగా ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మాత్రం తాజా ర్యాంకింగ్స్‌లో 11వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక ఫెదరర్ టాప్10 ర్యాంకింగ్స్ నుంచి వైదొలగడం 2017 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొంతకాలంగా ఫెదరర్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. దీంతో అతను పలు టోర్నీలకు దూరంగా ఉండక తప్పలేదు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై కూడా పడింది.
తాజాగా ఫెదరర్ టాప్10 నుంచి వైదొలగక తప్పలేదు. మరోవైపు జకోవిచ్ 11,430 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి దరిదాపుల్లో ఏ ఒక్కరూ లేక పోవడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ చాంపియన్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 9,630 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్) మూడో, అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. ఇక స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. ఇక రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లేవ్ ఆరో, మాటియో బెర్రెటెని (ఇటలీ) ఏడో, డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) 8వ ర్యాంక్‌లో నిలిచారు. కాస్పర్ రూడ్ (నార్వే) తొమ్మిదో, ఇండియన్స్ వేల్స్ మాస్టర్స్ టోర్నీ చాంపియన్ హుబర్ట్ హుర్కాజ్ (పోలండ్) పదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. ఇక హుర్కాజ్ కెరీర్‌లో టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించడం ఇదే తొలిసారి.
Roger Federer out of top 10 in Tennis Rankings