మతం నుండి రాజ్యాన్ని వేరు చేయాలన్న ఆయన తాత్విక న్యాయశాస్త్ర భావన మత సంస్థల నుండి పాలన వ్యవస్థను దూరం చేస్తుంది. లౌకిక భావాలకు, పాలనకు దారితీస్తుంది. మతరాజ్య వేర్పాటుకు రోజర్ తీవ్రంగా కృషి చేశారు. పాలన పౌరజ్ఞానంతో ఉండాలి. మతాచారాలతో, దైవభావాలతో నిండరాదని ప్రచారం చేశారు. వ్యక్తుల ప్రవర్తనలను దైవ, నైతిక పూజా సూత్రాలు నియంత్రించరాదు. రాజ్యం హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం, అబద్ధాలు, తల్లిదండ్రుల నిరాదరణలను అరికట్టాలి. రాజ్యం మత విశ్వాసాలను, ఆచారాలను, పూజా విధానాలను తిరస్కరించాలి. మత విషయాలలో రాజ్యజోక్యం మతాన్ని, సమాజాన్ని అవినీతిమయం చేస్తుంది. క్రైస్తవం లేని రోజుల్లో కూడా పౌర సుపరిపాలన సాగింది. రాజ్యం పౌర క్రమశిక్షణను, న్యాయాన్ని పోషించాలి అన్నారు. 400 ఏళ్ల నాడే నిరసనవాద మతాచారి రోజర్ విలియమ్స్ రాజ్యాన్ని మతం నుండి వేరు చేయాలన్నారు. ఈనాడు ప్రపంచ వ్యాపితంగా ప్రత్యేకించి భారత్‌లో రాజ్యం, మతం కలగాపులగంగా కలిసిపోయాయి. లౌకికత్వానికి తిలోదకాలిచ్చాయి.
రోజర్ విలియమ్స్ ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో జన్మించారు. ఆయన జన్మ నమోదు పత్రాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. రోజర్ 1603 లో జన్మించారని చరిత్రకారులు నిర్ధారించారు. ఆయన తల్లి ఆలిస్ పెంబర్టన్. తండ్రి జేమ్స్ విలియమ్స్ మర్చంట్ టేలర్ కంపెనీలో పని చేశారు. 1627లో డిగ్రీ పొందిన తర్వాత ఆంగ్ల కవి, మేధావి జాన్ మిల్టన్ డచ్, స్థానిక అమెరికన్ భాషలను నేర్పారు. మిల్టన్ ఆయనకు హిబ్రూ, గ్రీక్ భాషలను బోధించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్యూరిటన్‌గా మారడంతో చర్చిలో పదవులు పొందలేకపోయారు. చదువు తర్వాత రాజకీయ నాయకుడు, సామాన్యుల సభ సభ్యుడు సర్ విలియం మాషం అభిమాని అయ్యారు. రోజర్ ప్రొటెస్టాంట్, ప్యూరిటన్, వేదాంతి, రచయిత. 16, 17 శతాబ్దాల్లో రోమన్ క్యాథలిక్ చర్చి సంస్కరణల కోసం చర్చికి నిరసన తెలిపినవారిని ప్రొటెస్టాంట్లని, ప్యూరిటన్లని అనేవారు. ప్రసిద్ధ ప్యూరిటన్ ప్రబోధకుడు, రచయిత రిచర్డ్ బెర్నార్డ్ కూతురు మేరి బెర్నార్డ్‌ను 1629లో పెళ్ళి చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం.
కొలంబస్ నాయకత్వంలో ఇటాలియన్ నావికులు బహామాస్‌లో దిగి దాని భౌగోళిక స్వరూపాన్ని చూసి ఇండియాకు వచ్చామని ప్రకటించారు. అమెరిగొ వెస్పూచి అనే మరొక ఇటాలియన్ నావికుడు ముందుకెళ్ళి అమెరికాను కనుగొన్నాడు. దానికి ఆయన పేరే పెట్టారు. ఐరోపా ప్యూరిటన్ నాయకులు అమెరికా వలసకు సిద్ధమయ్యారు. రోజర్ వలసకు ఇష్టపడలేదు. ఇంగ్లండ్ చర్చి తప్పుడు విధానాలతో అవినీతిమయంగా మారింది. ఆర్చిబిషప్ విలియం లాడ్ పాలనలో రోజర్ ఇమడలేకపోయారు. 1630 డిసెంబర్ 1 న బయలుదేరి అమెరికా ఈశాన్య ప్రాంతానికి వలస వెళ్ళారు. బోస్టన్ చర్చి మతాధికారి జాన్ విల్సన్ స్థానం లో రోజర్‌కు మతాధికారి పదవిని ఇవ్వజూపారు. రోజర్ ఈ పదవిని తిరస్కరించారు. మత స్వేచ్ఛను, స్థానిక అమెరికన్ల న్యాయ వ్యవహారాలను సమర్థించారు. నైతికత, పూజా విధానాల క్రైస్తవ సూత్రాల ఆధారంగా ప్రజలను న్యాయమూర్తులు శిక్షించరాదని, వారికి మత స్వేచ్ఛ ఉండాలని వాదించారు. విగ్రహా రాధన, వారాంతపు పూజ, తప్పుడు పూజా పద్ధతులపై విస్తృతంగా బోధించారు. అనేక రచనలు చేశారు. రాజ్యం, మతం వేరుగా ఉండాలని పోరాడారు. ఈ భావాలను ప్యూరిటన్ నాయకులే వ్యతిరేకించారు. (సంస్కరణవాదులైనా మతవాదులే).
ప్రజలు అవినీతి ఇంగ్లండ్ చర్చి నుండి బయటకు రావాలని, దైవారాధనకు ప్రత్యేక చర్చిని స్థాపించాలని రోజర్ కోరారు. అదే ఆశయాలు గల సేలం చర్చి ఆయనను ఆహ్వానించి ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది. తర్వాత రోజర్ మరొక బ్రిటిష్ వలస ప్రాంతం ప్లైమూత్‌కు వెళ్ళారు. ప్లైమూత్ గవర్నర్ విలియం బ్రాడ్ ఫోర్డ్ ఆయన బోధనలను ఆమోదించారు. స్థానిక అమెరికన్ల భూములను ఐరోపా వలసదార్లు కొనడంపై ఉన్న నిషేధాన్ని ప్రశ్నించారు. రోజర్ బోధనలను మెచ్చుకున్న ప్లైమూత్ గవర్నర్ విలియం బ్రాడ్ ఫోర్డ్ ఈ నిరసనను విమర్శించారు. భూమిని కనుగొన్న మొదటి చక్రవర్తిని నేనేనన్న రాజు జేమ్స్ వాదనను రోజర్ ఖండించారు. 1633లో పాస్టర్ శామ్యూల్ స్కెల్టన్ సేలం చర్చికి రోజర్‌ను పూజారిగా నియమించారు. రాజు- మత కలయికను ప్రశ్నించిన నేరానికి బోస్టన్ న్యాయస్థానం రోజర్‌ను పూజారి పదవి నుండి తొలగించింది.
విభిన్న, కొత్త అపాయకర అభిప్రాయాలను రోజర్ ప్రచారం చేస్తున్నారని సార్వజనిక న్యాయస్థానం 1635 అక్టోబర్‌లో ప్రకటించింది. రాజద్రోహం, మత విరోధం అభియోగాలపై రోజర్‌ను బ్రిటిష్ వలస ప్రాంతం మసాచుసెట్స్ బే కాలని నుండి బహిష్కరించింది. 1636లో అట్లాంటిక్ మహాసముద్ర సరిహద్దులో, అమెరికా తూర్పు తీర ప్రాంతంలో రోజర్ ‘ప్రావిడెన్స్ ప్లాంటేషన్స్’ ను స్థాపించారు. నైతిక భావాల స్వేచ్ఛ పేరుతో శరణార్థుల, అల్పసంఖ్యాక మతస్థుల శిబిరంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ వలస ప్రదేశం తర్వాత రోడ్ ద్వీప వలస ప్రాంతంగా, రోడ్ ద్వీప రాష్ట్రంగా మారింది. రోజర్ విలియమ్స్ తన కొత్త వలస స్థావరం నుండి ప్రజల మత స్వేచ్ఛ కోసం, రాజ్యం -మతం కలవరాదని, వేరువేరుగా ఉండాలని, పాలనలో మత జోక్యం నిషేధమని, ప్రజలకు అధిక సంఖ్యాక ప్రజాస్వామ్య సూత్రాలు అమలు కావాలని ప్రచారం చేశారు. ఉద్యమాలు చేపట్టారు. రోజర్ అనుచరులు కొందరు ఆయన నుండి విడిపోయారు. 1638లో రోజర్, ఆయన 12 మంది అనుచరులు ప్రావిడెన్స్‌లో కొత్త మత విశ్వాసాల సంస్థను స్థాపించారు.
అది అమెరికాలో మొదటి బాప్టిస్టు చర్చిగా గుర్తింపు పొందింది. రోజర్ స్థానిక అమెరికన్ జాతులు, వలసదారుల మధ్య సఖ్యత కూర్చారు. 40 ఏళ్ల పాటు మధ్యవర్తిత్వం, చర్చలు, సంప్రదింపుల ద్వారా ఆ ఐక్యతను కాపాడారు, స్థిరపరిచారు. రోజర్ ‘అమెరికా భాషల ప్రాధాన్యత’ అన్న పుస్తకం రాశారు. అందులో స్థానిక ఈశాన్య అమెరికా జాతుల జీవితాలు, సంస్కృతులు, జనన మరణాల ఆచారాలు, అవసర సంస్కరణలను వివరించారు. స్థానిక జాతులపై వలసదారుల ఆధిపత్య ధోరణులకు స్వస్తి పలికారు. మనందరికీ దేవుడు ఇచ్చిన రక్తం ఒకటేనని ప్రచారం చేశారు. ఇవి ఈశాన్య అమెరికా జాతుల ఐక్యతకు తోడ్పడ్డాయి. ప్రభుత్వ బాధ్యతా రహిత, ప్రజా వ్యతిరేక విధానాలతో మరొక పుస్తకం రాశారు. రోజర్ బానిసత్వాన్ని నిరసించారు. యుద్ధంలో ఓడినవారిని బానిసలుగా మార్చడం నాటి ఆనవాయితీ. దీన్ని ఆయన వ్యతిరేకించకపోవడం ఆశ్చర్యం.
అయితే యుద్ధం లో స్త్రీలు, పిల్లలను బంధించరాదని, వారితో బానిసత్వ పనులు చేయించరాదని గవర్నర్‌కు ఉత్తరాలు రాశారు. 1637 జులై యుద్ధంలో పట్టుబడ్డ ఒక పిల్లవాన్ని వ్యక్తిగత సేవకునిగా స్వీకరించారు. ఆయన స్థాపించిన ప్రావిడెన్స్ ప్లాంటేషన్స్ 1652లో ఆమోదించిన చట్టంలో బానిసత్వాన్ని రద్దు చేయలేదు. బానిస కాల పరిమితిని తగ్గించారు. స్థానికులు బానిసలను సేవకులుగా నియమించుకోవచ్చన్నారు. ఇవి ఆయన సనాతన మతాచార సంకేతాలు. దైవ సర్వాధికారాన్ని, ప్రజల పాపాలను దేవుడు ప్రేమ, దయలతో పరిష్కరిస్తాడన్న మత సిద్ధాంతాలను రోజర్ తిరస్కరించారు. మతం నుండి రాజ్యాన్ని వేరు చేయాలన్న ఆయన తాత్విక న్యాయశాస్త్ర భావన మత సంస్థల నుండి పాలన వ్యవస్థను దూరం చేస్తుంది.
లౌకిక భావాలకు, పాలనకు దారితీస్తుంది.మతరాజ్య వేర్పాటుకు రోజర్ తీవ్రంగా కృషి చేశారు. పాలన పౌరజ్ఞానంతో ఉండాలి. మతాచారాలతో, దైవభావాలతో నిండరాదని ప్రచారం చేశారు. వ్యక్తుల ప్రవర్తనలను దైవ, నైతిక పూజా సూత్రాలు నియంత్రించరాదు. రాజ్యం హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం, అబద్ధాలు, తల్లిదండ్రుల నిరాదరణలను అరికట్టాలి.రాజ్యం మత విశ్వాసాలను, ఆచారాలను, పూజా విధానాలను తిరస్కరించాలి. మత విషయాలలో రాజ్యజోక్యం మతాన్ని, సమాజాన్ని అవినీతిమయం చేస్తుం ది. క్రైస్తవంలేని రోజుల్లో కూడా పౌర సుపరిపాలన సాగింది. రాజ్యం పౌర క్రమశిక్షణను, న్యాయాన్ని పోషించాలి అన్నారు. 400 ఏళ్లనాడే నిరసనవాద మతాచారి రోజర్ విలియమ్స్ రాజ్యాన్ని మతం నుండి వేరు చేయాలన్నారు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో రాజ్యం, మతం కలగాపులగంగా కలిసిపోయాయి.లౌకికత్వానికి తిలోదకాలిచ్చాయి.
సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545