ఢాకా: బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలోని శరణార్థుల శిబిరంలో రోహింగ్యాల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు చనిపోగా, 10మంది గాయపడ్డారు. శుక్రవారం ఈ ఘటన కోక్స్‌బజార్ జిల్లాలో జరిగింది. ఓ వర్గం మరో వర్గంపైకి కాల్పులు జరపగా, నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని శిబిరం వద్ద ఉన్న భద్రతా అధికారి తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యాపారం విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగమే ఈ ఘర్షణ అని తెలుస్తోంది. మయన్మార్ నుంచి ఈ ముఠాలు డ్రగ్స్‌ను సేకరిస్తాయి. మయన్మార్ సైన్యం తరిమికొట్టడంతో రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. 2017 ఆగస్టు నుంచి దాదాపు ఏడు లక్షలమంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వచ్చారు. బౌద్ధులు అధికంగా ఉన్న మయన్మార్‌లో ముస్లిం వర్గానికి చెందిన రోహింగ్యాలు మైనార్టీలు. గతంలోనూ రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రోహింగ్యాల సంఖ్య 11 లక్షలకు చేరినట్టు అంచనా.