న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సంచలనం శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ నా డ్రీమ్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. అతని సారథ్యంలో ఒక్క సారైనా ఆడటం తన కలని, అయితే ఇది సాధ్యమవు తుందా లేదా అనేది తెలియదన్నాడు. తనలాంటి ప్రతి క్రికెటర్‌కి రోహిత్ రోల్ మోడల్‌లాంటి వాడని వివరించాడు. అతనితో కలిసి ఆడాలనేది తన చిరికాల వాంఛ అని తెలిపాడు.
ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ ఎంతో మంది యువ ఆటగాళ్లను మేటి క్రికెటర్లుగా ఎదిగేందుకు దోహదం చేశాడన్నాడు. బుమ్రా, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఎదిగారంటే దానికి రోహిత్ అందించిన ప్రోత్సాహమే కారణమన్నాడు. కాగా, ఈ ఐపిఎల్‌లో మెరుగ్గా రాణించి రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించడమే లక్షంగా పెట్టుకున్నట్టు శశాంక్ వివరించాడు.