Tuesday, September 17, 2024

టీమిండియాకు షాక్

- Advertisement -
- Advertisement -
Rohit Sharma Injury During Practice Session 
గాయంతో టెస్టు సిరీస్ నుంచి రోహిత్ ఔట్
 ప్రియాంక్ పాంచల్‌కు టీమిండియాలో చోటు

ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ముంబైలో ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ గాయపడ్డాడు. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో రోహిత్ టీమిండియాకు దూరం కాక తప్పలేదు. అతని స్థాయిలో ఇటీవల ఇండియాఎకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రియాంక్ పాంచల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక రోహిత్ సిరీస్‌లో పాల్గొనడం లేదనే విషయాన్ని సోమవారం భారత క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఈ నెల 16న సౌతాఫ్రికా బయలుదేరి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇక కీలక ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మ గాయం వల్ల జట్టుకు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

ఇక అతను వన్డే సిరీస్‌లో పాల్గొంటాడా లేదా అనేది కూడా తేలడం లేదు. గాయం అధికంగా ఉండడంతో రోహిత్ వన్డే సిరీస్‌కు దూరమైన ఆశ్చర్యం లేదు. ఇటీవలే వన్డేల్లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ను బిసిసిఐ నియమించిన విషయం తెలిసిందే. అంతేగాక టెస్టుల్లో కూడా రోహిత్‌కు ప్రమోషన్ దక్కింది. విరాట్ కోహ్లికి డిప్యూటీగా రోహిత్‌ను బిసిసిఐ నియమించింది. ఇప్పటి వరకు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానెను కాదని రోహిత్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. కానీ గాయం వల్ల రోహిత్ శర్మ టీమిండియాకు దూరం కావడంతో అతని స్థానంలో ఎవర్నీ నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటే రహానెకే ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా టెస్టుల్లో టీమిండియాకు రహానె వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లి లేని సమయంలో చాలా సార్లు కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అతని సారథ్యంలోనే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే.

ప్రాక్టీస్ సెషన్‌లో గాయం..

ఇదిలావుండగా దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ముంబైలోని కుర్లా స్పోర్ట్ కాంప్లెక్స్‌లో సాధన చేస్తున్నారు. ఆదివారం రోహిత్ కూడా ఈ సెషన్‌లో పాల్గొన్నాడు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా ఓ బంతి రోహిత్ ఎడమ చేతికి బలంగా తాకింది. దీంతో అతని నొప్పితో విలవిల్లాడుతూ పడిపోయాడు. ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా గాయం తీవ్రంగా ఉన్నట్టు తేలింది. అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో సౌతాఫ్రికా సిరీస్‌కు రోహిత్ దూరం కాక తప్పలేదు.

రోహిత్ స్థానంలో ప్రియాంక్ పాంచల్‌కు చోటు

గాయం వల్ల టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్‌కు చెందిన ప్రియాంక్ పాంచల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో పాంచల్ భారతఎ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అంతేగాక పలు సిరీస్‌లలో ఇండియాఎకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ఇండియాఎ సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో పాంచల్‌ను సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా వెల్లడించింది. ఇక పాంచల్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News