బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తొలి టెస్టు అనంతరం జట్టుతో కలిసిన రోహిత్.. ఆడిన మూడు టెస్టుల్లో ఒక్క అర్థశతకం కూడా చేయలేకపోయాడు. కనీసం 20, 30 పరుగులు చేయలేకపోతూ తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అతను జట్టుకు భారంగా మారాడని, జట్టు నుంచి తొలగించాలని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, రోహిత్ తోపాటు టీమ్ ప్రదర్శనపై ప్రధాన కోచ్ గౌతమ్ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో ఘాటుగానే స్పందించినట్లు సమాచారం.
ఇక, జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరగనుంది. ఈ టెస్టుకు జట్టు ఎంపిక కీలకంగా మారింది. ఎవరిని జట్టులోకి తీసుకోవాలి.. ఎవరిని పక్కకు పెట్టాలనే దానిపై గంభీర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ ను జట్టు నుంచి తొలగించనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో శుభ్ మన్ గిల్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బౌలర్ ఆకాశ్ దీప్ ను ఐదో టెస్టుకు తీసుకోమని గంభీర్ వెల్లడించాడు. కానీ, రోహిత్ ఆడతాడా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు గంభీర్. గురువారం జట్టు ఎంపికపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.