దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు తృటిలో హ్యాట్రిక్ మిస్ అయింది.. అది కూడా కెప్టెన్ రోహిత్ శర్మ కారణంగా. దీంతో అక్షర్‌కు క్షమాపణ చెప్పిన రోహిత్ అతనికి ఓ ఆఫర్ ఇచ్చాడు.
మ్యాచ్‌లో అక్షర్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ తంజిద్(25) కీపర్ కెల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే ముష్ఫికర్ రహీమ్ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో అక్షర్‌కు హ్యాట్రిక్ సాధించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జకేర్ అలీ.. స్పిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ బంతిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అందుకోవాల్సింది.. కానీ చేజార్చాడు. దీంతో అందరు నిరాశచెందారు. వెంటనే రోహిత్, అక్సర్‌కు క్షమాపణ చెప్పాడు.
అయితే ఈ విషయంపై రోహిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘అది చాలా సులువైన క్యాచే. దాన్ని నేను అందుకోవాల్సింది. అందుకు నేను సిద్ధంగానే ఉన్నా.. కానీ, అలా జరిగిపోయింది. హ్యాట్రిక్ దూరం చేసినందుకు అక్షర్‌కు క్షమాపణ తెలియజేస్తున్నా.. బహుశా అతడిని డిన్నర్‌కు తీసుకువెళ్తానేమో’ అని రోహిత్ అన్నాడు. ఈ క్యాచ్ డ్రాప్‌పై అక్షర్ స్పందిస్తూ.. మ్యాచ్‌లో ఇలాంటివి జరగడం సహజమే అని పేర్కొన్నాడు.