ముంబై: రానున్న రెండు ట్వంటీ20 ప్రపంచకప్‌లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తే టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో జరిగే వరల్డ్‌కప్‌తో పాటు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న టోర్నమెంట్‌లోనూ రోహిత్‌ను సారథిగా నియమించడమే మంచిదన్నాడు. ఐపిఎల్‌లో మెరుగైన కెప్టెన్‌గా రోహిత్ పేరు తెచ్చుకున్న విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు. ఒత్తిడిలోనూ జట్టును ముందుండి నడిపించడంలో రోహిత్ ఎంతో పరిణితి సాధించాడన్నాడు. దీనికి అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ సాధించిన ఐపిఎల్ ట్రోఫీలే నిదర్శనమన్నాడు. త్వరలో జరిగే వరల్డ్‌కప్ తర్వాత టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో గవాస్కర్ ఇలాంటి సూచన చేశాడు. కోహ్లి స్థానంలో రోహితే సారథ్య బాధ్యతలు తీసుకోవడం ఖాయమని, అయితే అతనికి వరల్డ్‌కప్‌లోనే దాన్ని అప్పగిస్తే టీమిండియాకు ప్రయోజనంగా ఉంటుందన్నాడు.
రోహిత్ సారథ్య ప్రతిభతో భారత్ వరల్డ్‌కప్‌ను గెలిచినా ఆశ్చర్యం లేదన్నాడు. అయితే తాను ఈ క్రమంలో కోహ్లి సారథ్య ప్రతిభను తక్కువ చేసి చూడడం లేదని స్పష్టం చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లితో పోల్చితే రోహిత్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవం ఉండడమే దీనికి కారణమన్నాడు. అయితే రోహిత్‌ను సారథిగా నియమించాలా లేదా అన్నది పూర్తిగా బిసిసిఐకి సంబంధించిన అంశమన్నాడు. ఇక వైస్ కెప్టెన్‌లుగా కెఎల్.రాహుల్, రిషబ్‌లకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్నాడు. ఐపిఎల్‌లో వీరిద్దరూ కెప్టెన్‌లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నారని గవాస్కర్ పేర్కొన్నాడు.
Rohit should be captain for next two T20 World Cups: Gavaskar