హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండి ఎంఐకి ఐదు ఐపిఎల్ ట్రోఫీలు అందించాడు. ఎంఐ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్థిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో దూమారం రేగింది. రోహిత్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత సీజన్ లో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాండ్యాను హేళన చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ తరువాత తనకే అప్పగిస్తారని బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ ఎదురు చూశారు. పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంతో రోహిత్ అలిగినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రోహిత్ ఎంఐలో ఉంటాడా? లేక వేరే జట్టులోకి వెళ్లిపోతాడా? అనే ప్రశ్నగా మారింది. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపిఎల్ 2025 మెగా వేలంలో రోహిత్ ను ముంబయి జట్టు అట్టిపెట్టుకోదని ఆకాశ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఎంఐ జట్టులోకి కొనసాగడం రోహిత్ కూడా ఇష్టం లేదని, ముంబయి జట్టు ఒక వేళ వదిలేస్తే, ఆ జట్టుతో అతడి ప్రయాణం ముగిసినట్టేనని వివరణ ఇచ్చాడు. ముంబయి జట్టు కూడా సూర్య కుమార్ ను వదులకుంటుందా? అనే ప్రశ్నకు ఆకాశ్ సమాధానం ఇచ్చాడు. సూర్య కుమార్ ఆ జట్టు వదులుకునే ప్రసక్తేలేదన్నారు. గత సీజన్ లో పాండ్యా కెప్టెన్సీలో జట్టు ఘోరంగా విఫలం కావడంతో సారిథికి, జట్టు సభ్యులకు మధ్య సఖ్యత కూడా కనిపించకపోవడంతో పెద్ద దుమారం రేగినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. రోహిత్ శర్మ ముంబయిని వీడితే వేలంలో తీసుకునేందుకు ఇతర జట్లు పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది.