హైదరాబాద్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంవత్సరన్నర తరువాత టి20 జట్టులోకి వచ్చారు. టి20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా బరిలో ఎవరు దిగుతారు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలో రోహిత్‌కు జోడిగా శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చేవాడు. ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మొదటి టి20లో శుభ్‌మన్ గిల్-రోహిత్ ఓపెనర్‌గా వచ్చారు. తరువార రెండు టి20లో గిల్‌ను బెంచ్‌కు పరిమితం చేసి యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా తీసుకొచ్చారు. యశస్వి ఓపెనర్‌గా హాఫ్ సెంచరీ చేయడంతో పాటు దూకుడుగా ఆడుతుండడంతో అతడు ఓపెనర్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మీడియాతో మాట్లాడారు. శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో లేకపోవడంతో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా పంపిస్తే బాగుంటుందని తన మనసులో మాట చెప్పారు.
అతడి బ్యాటింగ్ విధానం బాగుండడంతో యశస్విని పక్కన పెట్టేలా కనిపించడం లేదని, ఆఫ్ఘాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓపెనర్ వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశారని ప్రశంసించారు. ఇండోర్ లో జరిగిన మ్యాచ్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. జైస్వాల్ జట్టు నుంచి తప్పించడం కష్టంగా మారిందన్నారు. శివమ్ దూబే బ్యాటింగ్ తీరు యువరాజ్‌సింగ్‌ను పోలి ఉందని చోప్రా ప్రశంసించారు. ఆప్ఘానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అతడి ఆట తీరును గమనించానని, బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడని, ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో క్లిష్ట సమయాల్లోనూ సూపర్ సిక్స్‌లు కొట్టాడని, తానైతే ఆల్‌రౌండర్ల జాబితాలో హార్ధిక్ పాండ్యాతో శివమ్ దూబేను ఎంపిక చేస్తానని చెప్పుకొచ్చారు. ఐపిఎల్‌లో ప్రదర్శన బాగుంటే అతడు కచ్చితంగా టీమిండియా జట్టులోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశారు.