ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, మీడియాఅనే నాలుగు మూలస్తంభాలు అని పెద్దలు చెబుతారు. అయితే ఈ వ్యాసంలో ‘మీడియా పాత్ర’ పై మాత్రమే కేంద్రీకరించి పరిశీలన చేద్దాము. మీడియా (ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా) అనేది ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పథకాలను, వార్తలను, ఇతర సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తాయి. అలాగే ప్రజల సమస్యలు, ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి మీడియా తెలియజేస్తుంది. అంటే మీడియా అనేది ఉభయ తారకంగా ఉండి, ఇరువురికీ మేలు చేసేదిగా ఉంటుంది. అయితే ప్రధానంగా మీడియా ప్రజాపక్షంగా ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. అది ప్రజా సమస్యలును ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి వాటిని సక్రమంగా పరిష్కరించటానికి మీడియా కృషి చేస్తుంది. ముఖ్యంగా వార్తా పత్రికలు తమ సంపాదకీయాల ద్వారా నిష్పాక్షికంగా ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ, లోపాలను సహేతుకంగా విమర్శిస్తాయి. అలాగే ఆయా రంగాలలో నిపుణులు రాసిన వ్యాసాలను ప్రచురిస్తూ, ప్రజలకు వివిధ పథకాలపై, వాటి అమలు తీరుపై అవగాహన కలిగిస్తాయి. ఈ వ్యాసాలు ప్రభుత్వ పథకాల అమలుపై అనుకూలంగానైనా ఉండవచ్చు లేదా విమర్శనాత్మకంగా కూడా ఉండొచ్చు. అలాగే ఎలెక్ట్రానిక్ మాధ్యమాల్లో ఆయారంగాల పార్టీ ప్రతినిధులతో గాని లేదా ఆయా రంగాలలో అనుభవం కలిగిన ‘సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్’ లతో గాని ప్రభుత్వ పని తీరుపై చర్చలు ఉంటాయి.
కాని ఈ మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి 14 మీడియా సంస్థల యాంకర్ల మీడియా సమావేశాలకు వెళ్ళరాదనే తీర్మానం చేశాయి. ఈ వార్త ప్రధాన మీడియా లోనూ, సోషల్ మీడియా లోనూ బాగా వైరల్ అయింది. దీనికి కారణాలను విచారిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మోడీ పరిపాలన మొదలైన (2014) నాటి నుంచి మీడియాలో ఒక బలమైన వర్గం ప్రభుత్వ ప్రచార, ప్రసార సాధనంగా మారింది అనేది ప్రధాన ఆరోపణ. దీనికి అనుగుణంగా మోడీ ప్రభుత్వం తన ఘనత చాటుకోవటానికి అధికారిక వ్యవస్థల మీద ఆధారపడకుండానే ప్రైవేటు మీడియా సంస్థలు ఉపయోగపడుతున్నాయి. ఇవి తమకు తాము స్వచ్ఛందంగా మోడీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తు తూ, ఆయన ప్రభుత్వాన్ని బలపరుస్తూ వార్తలు, కథనాలు, మీడియా చర్చలు చేస్తున్నాయా? లేక ప్రభుత్వ జోక్యం, ఒత్తిడి, ప్రలోభం లేదా బెదిరింపుల మూలంగా ఇలా మీడియా విధి లేక బాకాలు ఊదుతూ వ్యవహరిస్తుందా? అనేది ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజలకు కూడా అనుమానాలు వస్తున్నాయి.
ఇలా, మోడీ ఏది చేసినా, చేయకున్నా అకారణంగానే ఫోకస్ పెట్టి ఏకపక్షంగా సమర్ధించే మీడియానే ‘గోదీ మీడియా’ అంటున్నారు. ఈ పదాన్ని గతంలో ఎన్‌డిటివి మీడియా ఛానల్ యాంకర్, న్యూస్ ప్రజెంటర్ రవీష్ కుమార్ మొదటిసారిగా ఉపయోగించాడు. క్రమంగా మోడీ ప్రభుత్వాన్ని ఏకపక్షంగా సమర్ధించే యాంకర్లనూ, మీడియా సంస్థలనూ ‘గోదీ మీడియా’ గా ప్రసిద్ధి పొందింది. ఈ పదాన్ని విస్తృతంగా వివిధ మీడియా ఛానళ్ళలోనూ, సోషల్ మీడియాలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ‘గోదీ మీడియా’ ఏకపక్ష వికృత చేష్టలను నిలువరించడానికిగానూ విపక్ష ఇండియా కూటమి, ఆయా సంస్థల యాంకర్లను పేర్లు పెట్టి వారి వార్తలను, చర్చా కార్యక్రమాలను బహిష్కరించాలని మొన్న గురువారం ఐక్యం గా నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇంతకు మించిన మరో మార్గం కనపడలేదు. పర్యవసానంగా ‘ఇండియా’ ఐక్య సంఘటన 14 మంది యాంకర్లను దూరం పెట్టనుంది. ప్రతిపక్షం ఇలాంటి ప్రత్యక్ష ప్రతిఘటనకు దిగి పోరాడటం బహుశా దేశచరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. నిజానికి 14 మంది టివి యాంకర్లను బహిష్కరణ అనడం కన్నా ‘సహాయ నిరాకరణ’ చేయటం అనడం బాగుంటుందేమో. ప్రతిపక్షాలు ఈ ప్రధాన యాంకర్లు నిర్వహించే ఏ టివి చర్చల్లో కూడా పాల్గొనకూడదని నిర్ణయించారు. అందువల్ల దీనిని ‘సహాయ నిరాకరణ’ అనడం తప్ప ‘బహిష్కరణ’ అనలేము.
అయితే ప్రతిపక్షాల బహిష్కరిస్తున్నది కొంత మంది యాంకర్లను మాత్రమే తప్ప మొత్తం మీడియా సంస్థలను కాదు.అలాగే ‘మీడియా యాజమాన్యాలను’ కూడా కాదు. వాస్తవానికి ఈ మీడియా సంస్థల యాజమాన్యాల ఆదేశాలు లేకుండా ఏ యాంకర్ అయినా స్వతంత్రంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, విపక్షాలను అకారణంగా అదే పనిగా దుమ్మెత్తిపోసే అవకాశం ఉంటుందా! అన్నదే పెద్ద ప్రశ్న? అయినా ప్రతిపక్షం తమ పోరాటాన్ని యాంకర్ల వరకే పరిమితం చేయడం అది వారి నిరసనగా చెప్పుకోవచ్చు. అందుకు వారికి సహేతుకమైన కారణాలు ఉండి ఉండవచ్చు. ఈ మధ్య పత్రికలు, ప్రసార సాధనాలు ప్రభుత్వాలను నిలదీయడం చాలా వరకు మానివేశాయి. అధికార పార్టీకి భజన కార్యక్రమం మొదలుపెట్టాయి. ఆత్మగౌరవంతో తలెత్తుకొని సగర్వంగా ‘ఇజాలకు’ అతీతంగా, అధికార పార్టీలకు తలవంచకుండా నిష్పాక్షికంగా, నిబద్ధతతో పని చేయటం మానివేశాయి. ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు సొంత పత్రికలనూ, ఎలెక్ట్రానిక్ మీడియా సంస్థలను నడుపుకుంటున్నాయి. సోషల్ మీడియా గ్రూపులను కూడా తయారు చేసుకొంటున్నాయి.
ఏడాదికి పైగా ఢిల్లీ పొలిమేరల్లో రైతులు చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. చివరకు బిజెపి ప్రభుత్వ మెడలు వంచారు. రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేసేంత వరకు వారు విశ్రమించలేదు. ఈ పోరాటంలో అనేక మంది రైతులు తమ ప్రాణాలు వదిలారు. అప్పుడు ఈ గోదీ మీడియా కుంభకర్ణుడి నిద్ర నటించింది. వారి సమస్యలను పట్టించుకోలేదు. అలాగే అంతకు ముందు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తే ఈ గోదీ వీడియా ఏమాత్రం పట్టించుకోలేదు. ‘కరోనా’ మహమ్మారి దేశమంతా వ్యాపించింది, అల్లకల్లోలం చేసింది, లక్షలాది మంది మృతి చెందారు. ఆక్సిజన్ లేక ఆసుపత్రులలో పడకలు లేక, మందులు లేక జనం పిట్టల్లా రాలిపోయారు. గంగా నదిలో వేలాది శవాలు తేలియాడుతూ కొట్టుకు పోయాయి. అయినా ఈ బిజెపి ప్రభుత్వం వద్ద వారికి సంబంధించిన గణాంక వివరాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినా ఈ గోదీ మీడియా నోరు మూసుకుంది. పతాక శీర్షికలో రాయాల్సిన వార్తలను కూడా ప్రస్తావించ లేదు. పైగా ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ గోదీ మీడియా ప్రతిపక్షాలను నిలదీయడంలో మాత్రం అతి ఉత్సాహం ప్రదర్శిస్తుంది.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికే ప్రతిపక్ష ‘ఇండియా’ ఐక్యసంఘటన 14 మంది యాంకర్లను బహిష్కరించి తమ నిరసనను తెలిపింది. అయినా ఈ గోదీ మీడియా తమ ప్రవర్తనను మార్చుకొని బాధ్యతగా ప్రవర్తిస్తుందని నమ్మకం లేకపోయినా వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా! మోడీ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను తీసుకుంది. పార్లమెంటులో తనకు ఉన్న మంద బలంతో చర్చలు లేకుండా అనేక బిల్లులను ఆమోదించుకున్నది. మణిపూర్‌లో గిరిజనులు చస్తున్నా, మహిళలను మానభంగాలు చేస్తూ ఊరేగించినా, ఇళ్ళు, ప్రార్థనా స్థలాలను మంటల్లో తగలబడుతున్నా ఈ గోదీ మీడియా కళ్ళు మూసుకుంది. రూపాయి విలువ ఘోరంగా పతనమవుతున్నా, దేశ అప్పులు, వడ్డీలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా ఈ మీడియాకు కనపడదు. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్నా ప్రజల హాహాకారాలు వినబడని చెవిటి సంస్థలుగా ఈ గోదీ మీడియా సంస్థలు తయారయ్యాయి. ఇప్పటికే అదానీ వశంలో 80% జాతీయ మీడియా చిక్కి గిలగిలలాడుతున్నది.
పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల పెట్టుబడులతో నడిచే మీడియా నుండి ఇంతకన్నా ఏమీ ఆశించలేము. ప్రభుత్వ అధికారుల గణం, దర్యాప్తు సంస్థలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయాయి. మీడియా సంస్థలు భజనకు అలవాటు పడ్డాయి. న్యాయ వ్యవస్థ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నది. ప్రజలు ఆశగా న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తున్నారు. మొత్తంగా మోడీ 9 ఏళ్ళ పాలనలో మన దేశ, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలు, లౌకిక జీవనం, మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయి. ప్రజాస్వామిక వాదులు, మేధావులు వేగంగా ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి, భావి తరాలను కాపాడాలి. విజ్ఞుల చైతన్యమే ఈ విపత్తు నుండి సామాన్య ప్రజలను రక్షిస్తుంది.