Wednesday, January 22, 2025

సాయుధ పోరులో స్త్రీల పాత్ర

- Advertisement -
- Advertisement -

నేడు దేశంలో మహిళ సాధికారత కోసం అనేక సంస్ధలు విశేషమైన కృషి చేస్తున్నవి. మహిళలు నేడు అనేక రంగాల్లో ఉజ్వలమైన అభివృద్ధి సాధించారు. పార్లమెంటులో సైతం మేమేంతో మాకంత సమాన వాటా, అవకాశాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం నేటి మహిళలు ఉద్యమిస్తున్నారు. ఈ చైతన్యం తెలంగాణలో 75 సంవత్సరాల క్రితమే తెలంగాణ సాయుధ పోరాటంలో వెల్లివిరిసింది. మహిళల మహోన్నత సాయుధ సమరాన మహిళాశక్తి ఎంతో త్యాగనీయమైనది.భూమి కోసం, కూలీ పెంపు కోసం, వెట్టి నుండి విముక్తి కోసం సాయుధ పోరాటంలో గెరిల్లాలుగా, మహిళా సైనికులుగా వారి పాత్ర అనిర్వచనీయమైనది. ఈ పోరాటంలో మైదాన గ్రామీణ మహిళలేకాకుండ కోయ, చెంచు, లంబాడ మహిళలు వీరోచితంగా పోరాట పటిమ ప్రదర్శించా రు. ముఖ్యంగా మహిళలు ఉద్యమం తీవ్రంగా ఉన్న దశలో పురుషులతో పాటు స్త్రీలు ఆయుధాలు పట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. కొందరు కొరియర్లుగా, ప్రజా సంఘాల కార్యకర్తలుగా, కళాకారులుగా, ఆహార చేరవేత కార్యక్రమంలో చురుకైన పాత్ర వీరిది.

రజాకార్లు, యూనియన్ మిలిటరీ సైనికుల ఆగడాలను ఎదుర్కొని సాయుధ పోరాటంలో మహిళలు ఎంతో ధీరత్వం, చైతన్య ప్రదర్శన కనబరిచారు. మనకు తెలిసిన మహిళా పోరాట యోధురాలైన మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి మొదలగు మహిళ పోరాట పటిమ కనబరిచిన వీర నారులే కాకుండ ఇంకా ఎంతో మంది వెలుగులోకి రాని చైతన్య మహిళామణులు చరిత్ర కెక్కివలసిన వారు ఉన్నారు. ఈ కోవకు చెందిన మరో వీర నారి చాకలి లచ్చమ్మ. ఊరు నడిగడ్డ గ్రామం, చాకలి కుల వృత్తి, బట్టలు ఉతుకుతూ ఉద్యమంలో రహస్య కార్యకర్తగా, దళాలకు ఆహారం అందించేది. ఒక రోజున రజాకారు సైనిక దళాల జాడ చెప్పాలని తీవ్రమైన దాడి చేసినా, ఎక్కడా రహస్యాలు బయట పెట్టలేదు. ఆ తర్వాత పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలో చేరి చురుకైన పాత్ర పోషించారు. మరో మహిళా నాయకురాలు జనగామ జిల్లా ఖిలాషాపురం గ్రామం గౌడ సామాజిక వర్గమైన దూడల సాలమ్మది వీరోచిత చరిత్ర.

చిన్న వయసులోనే భర్త తాటి చెట్టు ఎక్కి ప్రమాదంలో మరణిస్తే కుటుంబం, పిల్లలను పోషణ చేసుకుంటూ వ్యవసాయం, కులవృత్తి చేస్తూ జీవనం కొనసాగించేది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్షితురాలై ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. గబ్బేట తిరుమల రెడ్డి, నల్ల నర్సింహులు నాయకత్వంలో పూర్తి సమయం కార్యకర్తగా ఉద్యమంలో పని చేసింది.
ఉద్యమ సమయంలో వీరి ఇల్లు రాజకీయ క్షేత్రంగా ఉండేది. దీనితో స్థానిక భూస్వాములు, రజాకార్లు ఈమె ఇల్లు కూల్చివేయడంతో సాయుధ దళ కార్యకర్తగా మారి సాయుధ శిక్షణ తీసుకొని సుశిక్షితమైన రైఫిల్ షూటర్‌గా శిక్షణ పొంది ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అజ్ఞాతంలో ఉన్న దూడల సాలమ్మ దగ్గర బంధువులు చనిపోయారని సమాచారం అందితే శత్రువు సమాచారం వల్ల దూడల సాలమ్మను మైసూరు పోలీసులు అరెస్టు చేసి రెండు సంవత్సరాలు జైల్లో ఖైదీని చేశారు. మరో వీరనారి దాము మంగిలి కొడకండ్ల మండలం ధర్మపురం గ్రామం.

వీరు తెలంగాణ సాయుధ పోరాట నాయకులకు ఆశ్రయం ఇస్తున్నారని విసునూరు రజకార్లు ఈమె తండ్రిపైన దాడి చేసి నాయకులు ఎక్కడవున్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టారు. అయినా ఎక్కడా రహస్యలు చెప్పకుండ వారి పైన తిరుగుబాటు చేసింది. ఈ సంఘటనలో తిరుగుబాటు చేసిన ఐదుగురు యువకులను దాము మంగిలి ముందే చంపి చితిపేర్చారు. ఈ ఐదుగురులో దాము మంగిలి కొడుకు కూడా వున్నాడు. అయినా నాయకత్వం జాడ చెప్పలేదు దాము మంగిలి. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు నెలలకు మళ్ళీ తండాపైన దాడి చేసి ముగ్గురు యువకులను కాల్చి చంపారు. ఇలా ఎన్ని బాధలకు, చిత్రహింసలకు గురైనా మంగిలి దిగజారిపోలేదు. మంగిలి నలుగురు కొడుకులను జైల్లో పెట్టినా, కుటుంబ సభ్యులను హింసించినా సాయుధ పోరాటంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మంగిలి జీవిత కాలం కొనసాగారు.మల్లీకాంబ వీరిది ఖమ్మం జిల్లా. వీరి భర్త బ్రహ్మయ్య అనారోగ్యంతో చనిపోతే ఆరుగురు పిల్లలను పోషణ చేసుకుంటూ సాయుధ పోరాటంలో నాయకత్వానికి సహాయకారిగా ఉండేది.

ఈమె పెద్దకొడుకు సాయుధ దళంలో చేరాడు. సుద్దేపల్లే గ్రామంపైన రజాకార్లు దాడి చేసినప్పుడు ఈ విషయాన్ని మచ్చ వీరయ్య దళానికి చెప్పి రజాకార్లు దోచుకున్న సొమ్ము మరలా విడిపించారు. ఈ విధంగా ఉద్యమ ప్రయాణంలో అనేక యాతనలు ఎదుర్కొని నిలిచిన వీర వనిత మల్లీకాంబ. రాంబాయమ్మ వీరి గ్రామం పిండిప్రోలు తెలంగాణ సాయుధ దళాలకు పిండిప్రోలు గుట్టలు ముఖ్యమైన స్థావరంగా ఉండేవి. రాంబాయమ్మ సాయుధ పోరాట దళాలకు ఎంతో సహాయ సహకారాలు అందించేది. స్త్రీలందరిని సమీకరించి ఉద్యమంలో చేర్పించేది. రజాకార్ల సైన్యం పిండిప్రోలు గుట్టలపైన దాడి చేస్తున్న విషయం తెలుసుకొని విషయాన్ని దళానికి తెలపడంతో ఈమెను అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో 18 నెలలు బందించారు. నందిగామ తాలూకాలో వెంకమ్మ యూనియన్ సైన్యం దాష్టీకమైన చర్య వల్ల చనిపోయింది. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో గెరిల్లా దళంలో స్త్రీల పాత్ర వీరోచితమైనది.
రంగమ్మ నల్లమల అడవుల్లో తుపాకి చేపట్టిన గెరిల్లా దళ సభ్యురాలు. తిరుపతమ్మ మరో గెరిల్లా సభ్యురాలు వీరిది చింతపాలేం. ఈమె ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ధీర వనిత. సావిత్రమ్మ హుజుర్‌నగర్ సాయుధ పోరాటంలో ప్రజల కోసం పని చేసింది. భారత సైనికులు ఈమెను బందించి జైలుకు పంపారు. వీరే కాకుండా నరసమ్మ, లచ్చమ్మ, పాపక్క, పడిగపాటి నాగమ్మ, బూదేమ్మ, కోయ లచ్చక్క ఇంకా ఎంతో వీర నారీమణులు తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. 75 సంవత్సరాల సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో నాటి ఉద్యమ చైతన్య దివిటీని అందుకొని నేటి మహిళా సాధికారత వైపు పయనించడమే. సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళలు అందించిన దివిటీని నేటి ఆధునిక మహిళ అందుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అవే వారికి ఇచ్చే ఘన నివాళులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News