కవిత్వాన్ని అనుభవాల సార్వజనీన వ్యక్తీకరణ అంటారు కవులు. ఈ సార్వజనీన వ్యక్తీకరణ ప్రాసలో ఉంటుందని గొథె చెబుతాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే కవిలోని భావనాత్మక అచేతన నుండి గేయం వస్తుంది. ఈ అచేతన స్థితి అనేది అన్ని భాషలకూ వర్తించినప్పటికి ఉర్దూలో కొంచెం ఎక్కువ అని చెప్పాలి. గజల్ పితామహుడు మీర్ తకీ మీర్ తన మూడ్ గురించి చెబుతూ ‘ముజ్హ్ కో యారో మాఫ్ కర్ నా, మై నషే మే హు’ అంటాడు. ఆ మూడ్ నుంచి పుట్టిన గజల్ అన్నీ చాలా ఉల్లేఖనీయాలుగా మిగిలాయి.
‘ఇత్తెదాయె ఇష్క్ హై రోతా హై క్యా
ఆగే ఆగే దేఖియే హోతా హై క్యా’
( ప్రేమ ప్రారంభంలోనే ఏడుస్తావ్ ఎందుకు ఇంకా ఏడవవలసిన కాలం ముందున్నది)
అన్న మీర్ తకీ మీర్ షేర్ అత్యంత లోక ప్రసిద్ధమైనది. బహుశా ఉర్దూ సాహిత్యానికి, ప్రత్యేకంగా గజల్ వస్తువుకు ఇది ఒక నమూనా లాగా చూపించదగిన షేర్. ఈ గజల్ కవితా రూపం తెలుగులోకి వస్తూ ఉంది కానీ విస్తారంగా ప్రజాదరణ పొందలేకపోవడమనేది గమనించదగిన అంశమే. అందుకు కారణం ఇక్కడి సాహిత్య వాతావరణం లోను ఉంది, గజల్‌ను తెలుగులోకి తీసుకు వచ్చిన వాళ్ళ శక్తి సామర్ధ్యాలలోనూ ఉంది. గజల్ ఏడవ శతాబ్దంలో పర్షియాలో అరబిక్ భాషలో వచ్చిందని అంటారు. ఇది భారతదేశానికి ఢిల్లీ సల్తనేట్ స్థిర పడుతున్న 12వ శతాబ్దపు తొలి రోజుల్లో వచ్చిందని చెప్పవచ్చు. గజల్ అత్యంత కఠినమైన చందస్సు ఉన్న కవిత రూపం.
ఇది ఒక మాత్రాబద్ధ రచన. ఐదు నుండి ఏడు వరకు కప్లేట్స్ ఉంటాయి. మొదటి కప్లేట్ ను మత్లా అని చివరి కప్లెట్ ను మక్తా అని అంటారు. మత్లాలో రెండు పాదాలలోనూ రదీఫ్, కాఫీయా ఉండగా మిగతా షేర్లు అన్నింటిలోనూ రెండవ పాదంలో మాత్రమే ఇవి పాటించబడతాయి. తఖుల్లస్ పేరున కవి నామస్మరణ ఉంటున్నా అది కఠినమైన నిబంధన అని చెప్పలేము. రదీఫ్ అంటే అంత్యప్రాస కాదు. ఒక సమాన పదం. కాఫీయా అంత్యప్రాసే కానీ అచ్చులు అంతంలో ఉండడం ప్రధానం కాదు. ఆ పదంలోని అకార, ఇకార, ఉకార అంతాలలో ఏదో ఒక సామ్యత మాత్రమే ఉండే హల్లు. ఒక రకంగా ఇది కఠినమైన ఛందస్సు అనిపించినా తెలుగు చందస్సులో పద్యాల కాఠిన్యంతో పోల్చినప్పుడు మరీ అంత ఎక్కువ కాదని చెప్పవలసి ఉంటుంది.
ప్రపంచంలోని భాషలన్నింటికీ ఒక మౌలికమైన ఛందస్సు తొలి రోజుల్లో నైతే ఉండే ఉన్నది. ఇంగ్లీషులో సానెట్, హిందీలో దోహ, అరబ్బీలో గజల్, ఫారసీలో రూబాయి, కన్నడంలో వచనం, తెలుగులో పద్యం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.
గజల్‌ను తెలుగులోకి తెచ్చిన దాశరథి, డాక్టర్ సి.నారాయణరెడ్డిలలో, దాశరథి గజల్ స్వభావంలో పెద్దగా మార్పు తీసుకురాకపోయినప్పటికీ, డాక్టర్ సి.నారాయణరెడ్డి గజల్‌లో వస్తు మార్పిడి చేసి ప్రజామోదం పొం దగలిగాడు.
‘అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు సరితూగమంటే నేను ఒరిగేను అమ్మ వైపు’
అన్న షేర్
’పరుల కోసం పాటుపడని నరునిబతుకు దేనికని
మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని’
అన్న షేర్లను లోక ప్రసిద్ధం చేశారు.
డాక్టర్ ఎస్.ప్రభాకర్ తెలుగులో సుప్రసిద్ధమైన కవి. శ్రీశ్రీ తోనూ, ఆత్రేయతోను, శేషేంద్ర తోను, సినారెతోను, ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకులు బాలసుబ్రమణ్యం తోను కలిసి తిరిగాడు. చాలా సందర్భాలలో ప్రగతిల కవిత్వం రాసినప్పటికీ ఉర్దూ కవిత్వపు ప్రేరణతో గజల్ కూడా రాశాడు. డాక్టర్ ఎస్ ప్రభాకర్ ప్రేరణ శీర్షికతో తెచ్చిన కవితా సంపుటి నీ గజల్ అన్నాడు. అయితే విప్రలంబ శృంగారం అనే విస్ఫులింగం ఉన్న కవితా సంపుటిగా దీన్ని గుర్తించవచ్చు కానీ ఇది షేర్ లక్షణాలను పూర్తిగా కలిగి లేదు. అలా అని తెలుగులో ద్విపదలాగా నైనా ఉందా అని కూడా చెప్పలేము. నిర్దిష్ట లయ, ఛందస్సు ఏమీ లేకపోయినా స్వచ్ఛందంగా సాగిన గజల్ లోని భావచందస్సు మాత్రం ఈ కవికి పట్టుబడింది. భావం, లయ మాత్రం గజల్ లాగే ఉన్నది. తనకు శ్రీశ్రీతోనూ, దాశరధితోనూ పోలికలు ఉన్నాయని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటాడు ఈ కవి.
ఈ స్టాంజా చూడండి.
‘కవికుల గురువు మీర్ తకీ మీర్ శ్రీశ్రీ నాకు నేనే బరువు గాలిబ్‌ను నేనే’ అంటాడు. దేవులపల్లి రామానుజారావు గారు గాలిబ్ గీతాలకు ముందుమాట రాస్తూ దాశరధిని పూర్వజన్మలో గాలిబ్ గా అభివర్ణించాడు. ఈ పుస్తకంలో బొమ్మలు వేసి, బుక్ మేకింగ్ చేసి ఈ కావ్యాన్ని న భూతో న భవిష్యతి అని చెప్పదగ్గంత సౌందర్యోపేతంగా తీసుకు వచ్చారు నలుగురు చిత్రకారులు. బాలి, గంగాధర్, డా.సాయి కృష్ణ, మోహన్, కరుణాకర్‌లు ఈ కావ్యానికి కొత్త ప్రాణం పోసారు. నిజానికి ప్రేరణ మలి ముద్రణ. కానీ ఈ సౌందర్య ఉద్దీపన వల్ల దీనిని తొలిముద్రగా వేసుకున్నాడు కవి. ప్రముఖుల ముందు మాటల డేట్స్ లేకపోవడంతో ఇది ఏ రోజు రాయబడిన ముందుమాట అని తేల్చుకోలేక పాఠకుడు అయోమయంలో పడిపోతాడు . ఎందుకంటే 40 సంవత్సరాల ముందు రాసిన శ్రీ శ్రీ ముందుమాటను డేట్ లేకుండా ఈ పుస్తకంలో పెట్టి దీన్ని తొలిముద్రణ అనడం ద్వారా ఈ అయోమయం తల ఎత్తుతుంది. ఇరవైకి పైగా గ్రంధాలు రాసిన సుప్రసిద్ధ రచయిత కె. ప్రభాకర్ కు తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం ఫ్రెంచ్ ఉర్దూ బాగా తెలిసిన భాషలు. రాత తెలియకపోయినా తమిళం కన్నడం లాంటి భాషలు కూడా అర్థం చేసుకోగలిగి ప్రత్యుత్తరం ఇవ్వగలిగినటువంటి భాషలు.
ప్రేరణలో కొన్ని చర్చించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. ఇందులో ‘ఉర్దూ సాహిత్యమునకు తెల్గున వేగుచుక్కను తెన్గు కావ్య పరిమళం వెదజల్లే సుగంధపు చక్కను’
అని ఒకచోట అంటారు. ఈ మాటను ఈ కావ్యానికి ముందు మాట రాసిన సామల సదాశివ నర్మగర్భంగా తన అనంగీకారం తెలియజేశారు. అలాగే ’ఎంత నాజూకు చేతులే ఇంతి నీవి’ అని ప్రభాకర్ అన్నప్పుడు ’ఎంత తీయనకు పెదవులే ఇంతి నీవి’ అన్న గాలిబ్ మాటలు కూడా గుర్తుకు రాక మానవు. అలాగే
‘నిన్నే అనుకరించి అనుసరించేదనే బాల
లోకమంతా నవ్వుకొనునేమో నాకేమి సిగ్గు’
అన్నప్పుడు కృష్ణశాస్త్రి గేయం
“దిగిరాను దిగిరాను దివి నుండి భువికి
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు
నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు”
అన్న ద్విపద పాదాలు గుర్తొస్తాయి. అయితే అది ద్విపద అన్న సంగతి చాలామంది పాఠకులు పట్టించుకోరు. కానీ మూడు ఇంద్రగణాలు ఒక సూర్య గణాన్ని వరుస వరుసగా పేర్చుకుంటూ పోవడంలోని సౌందర్యం కృష్ణశాస్త్రికి తెలుసు. ఈ భావాన్ని మాత్రమే అనుసరించి రాసినటువంటి ప్రభాకర్ ద్విపద కానీ, ఆట వెలది గాని, తేటగీతి గాని పాదాలను వాడుకున్నట్లు అనిపించదు.
‘నా చెంప పైన కొట్టితివి గాని
నీ చేతులు కందెనేమో చూసుకో’
అని ఇంకొక షేర్ ఉంటుంది. దీన్ని ఇంకా అందంగా చెప్పొచ్చు అని సాధారణ పాఠకుడికి కూడా అనిపిస్తోంది. సాధారణ పాఠకుడంటే ఉర్దూ అనువాదాలు కొన్ని చదివిన పాఠకుడు.
‘నా చెంప పగలగొట్టితివన్న బాధ లేదు
నీ చేయి కందినేమో నన్ను వేదన నాది’
అంటే ఇంతకంటే సౌందర్యవేతంగా అనిపించి ఉండేది. అలాగే ఈ కవి మొదట అభ్యుదయ కవిత్వం రాసిన వాడు. ఆ ఛాయలు ప్రణయ కవిత్వంలోనూ కనిపిస్తున్నాయి. ఒకచోట అంటాడు:
‘వనితా జనతా లేని దుర్గం ఎందుకు
సమతా మమత లేని స్వర్గం ఎందుకు’
ఇలా చూసినప్పుడు ప్రభాకర్ ప్రేరణలో ఉన్న కవిత్వమంతా ప్రణయ కవిత్వమే కానీ ఇతమిద్దంగా రూపానికి కట్టుబడిన కవిత్వం కాదని అనిపిస్తుంది. కానీ ఇందులోని అభివ్యక్తి మనలను చాలా ఆనందపరిచే మాట మాత్రం ఎవరూ కాదనలేని నిజం. కొన్ని ఉదాహరణలు:
‘కలము పట్టితి కవిత కొరకు
కాళ్లు నడిచెను వనిత కొరకు’
‘నా యొక్క దిల్ కి దర్ద్
కొంతైనా విప్పగలదు ఉర్దూ’
‘ప్రణయ పంకాన పడని వారు ఉందురా లోకాన
పడి విరహ గీతాలు రాయకుందురా శోకాన’
‘నీ మనసు మంచి గంధపు చెక్క
నీ వయసు వగరుపోని వక్క’
‘అద్దములో నా మోము చూచి
అద్ద మునే ముద్దాడి ముద్దుగుమ్మ’
‘తలపోసి తలపోసి ఇట్లయితి గాని
నేనెంతో అందగాడిని సుమా’
‘చెలి నీ పొందు చిక్కలేదు గాని
లోకమంతా అది పొక్కిపోయెను కదా’
‘నాకేమి లోకులతో భయము నీవున్నచో
శోకంబులోనైనా జయము’
‘కైతల రాణికి విడాకులు ఇత్తుమనిన
కనిపించడేమి నాకు ఏ న్యాయవాది’
ఏనుగు నరసింహారెడ్డి