హైదరాబాద్: జిహెచ్‌ఎంసికి కొత్త కమిషనర్ వచ్చారు. జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా పని చేస్తున్న డి.ఎస్.లోకేష్ కుమార్ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా నియమితులు కావడంతో ఆయన స్థానంలో 2020 మార్చి నుంచి ఫైనాన్స్ సెక్రటరీతోపాటు టిఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న డి.రోనాల్డ్ రోస్‌ను జిహెచ్‌ఎంసి నూతన కమిషనర్ గా నియమిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
2006 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రోనాల్డ్ రోస్ జిహెచ్‌ఎంసితో ఇప్పటికే అనుబంధం ఉంది. 2013లో 9నెలల పాటు జిహెచ్‌ఎంసి ప్లానింగ్, ప్రాజెక్ట్, హెరిటేజ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగాల అదనపు కమిషనర్‌గా పనిచేసిన రోనాల్డ్ రోస్ అంతకు ముందు 2012 సెప్టెంబర్లో 10 నెలలు, 2014లో మరో 6 నెలల పాటు అత్యంత కీలకమైన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ , మెదక్, నిజామాబాద్ కలెక్టర్‌గా పని చేసిన రోనాల్డ్ రోస్ 2020 నుంచి రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా నియమించింది.