Sunday, January 19, 2025

ప్రజ్ఞాన్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిపై అన్వేషణలో ఉన్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ ఓ భారీ గుంతనుంచి తృటిలో తప్పించుకుంది. తన ముందు కేవలం నాలుగు మీటర్ల దూరంలో ఈ గుంత ఉన్నట్లు గుర్తించింది. సంబంధిత ప్రమాదం సంకేతాలను బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌కు సెకండ్ల వ్యవధిలో పంపించింది. అప్రమత్తం అయిన ఇస్రో సాంకేతిక సిబ్బంది వెంటనే తగు సందేశాలు ఇచ్చి , తమ అంతరిక్ష డ్యూటీలో ఉన్న రోవర్ రూట్ మార్చారు. వెంటనే ఇది గుంతను తప్పించుకుని నిర్ధేశిత సరికొత్త మార్గంలో తిరిగి అన్వేషణకు వెళ్లిందని ఇస్రో సోమవారం ప్రకటన వెలువరించింది. తన ముందు నాలుగు మీటర్ల వెడల్పుతో ఉన్న చంద్రుడి గుంతను రోవర్ పసికట్టిన విషయాన్ని ఈ ట్విట్టర్ సందేశంలో తెలిపారు. తనకు ఎదురైన గండం దాటుకుని ఇప్పుడు రోవర్ సరైన మార్గంలో ముందుకు సాగుతోందని వివరించారు. ఈ గుంతలోకి రోవర్ జారి పడి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. రోవర్‌కు ఎప్పటికప్పుడు సక్రమ మార్గం చూపించే నావిగేషన్ ఏర్పాట్లు ఈ రోవర్‌కు అమర్చి ఉన్నాయి.

దీనితోనే రోవర్ ముప్పు తప్పింది. ఆరు చక్రాల ఈ సౌర శక్తి ఛాలక రోవర్ ఇప్పుడు తనకు ఇంతకు ముందు తెలియచేయని తాజాగా అందిన రూట్లో సాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై ఏఏ మార్గంలో ఏ విధంగా వెళ్లాలనేది ఇస్రో కమాండ్ సెంటర్ ముందుగా నిర్ధేశించి ఉంచింది.ఈ మేరకు మ్యాప్ అమర్చి ఉంది. అయితే కీలకమైన అడ్డంకి ఏర్పడటంతో ఇప్పుడు తన దిశ మార్చుకుని ముందుకు పట్టువదలకుండా సాగుతోంది. ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలను, శాస్త్రీయ డేటాను తమ కేంద్రానికి చేరవేస్తున్నట్లు ఇస్రో సంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రయాన్ 3 నుంచి వీడిన ల్యాండర్, రోవర్‌లు చంద్రుడి పగటికాంతితో రెండు వారాలే జీవం పోసుకుని తమ పనిచేయగల్గుతాయి.ఈ క్రమంలో రోవర్‌కు సంబంధించి ప్రతిక్షణం విలువైనదే. దీని నుంచి అందే ప్రతి ఫోటో, డేటా కీలకమే అవుతుంది. చంద్రుడిపై పగటికాంతిని వినియోగించుకుంటూ రోవర్ పయనం సాగుతోంది. ఇప్పటికే నాలుగురోజులు గడిచిన దశలో ఇక రోవర్, ల్యాండర్‌లకు ఇప్పటి అంచనాల ప్రకారం మరో పదిరోజుల జీవితకాలం మిగిలి ఉంది. దీనిని సక్రమంగా వినియోగించుకుని పంపించే సమాచారం ఇస్రో సాంకేతికతకు అమూల్యం అవుతుంది.

కాలంతో పోటిపడి పరుగు
స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ దేశాయ్
ఇప్పుడు పదిరోజుల బాకీ దశలో చంద్రుడిపై రోవర్ కాలంతో పోటీ పడి సాగుతోందని స్పేస్ అప్లికేషన్స్‌సెంటర్ (సాక్) డైరెక్టర్ నిలేశ్ ఎం దేశాయ్ సోమవారం తెలిపారు. ఇది ఇప్పటివరకూ సక్రమంగా పనిచేస్తోంది. ఎదురులేకుండా ఉందని తెలిపారు. ఇప్పటివరకూ అభేధ్యంగా ఉన్న చంద్రుడి దక్షిణ ధృవం నుంచి తగు సమాచారాన్ని ఈ ఆరుచక్రాల రోవర్ నుంచి సాధ్యమైనంత వరకూ సేకరించుకునేందుకు ఇస్రో సైంటిస్టులు నిర్విరామంగా పాటుపడుతున్నారని తెలిపారు. సాఫ్ట్‌ల్యాండింగ్, ల్యాండర్, రోవర్‌లు సక్రమంగా దిగడం, తరువాత పరిశోధనలకు ఉపక్రమించడం చంద్రయాన్ 3లోని మూడు కీలక విషయాలని, ఈ మూడు ఇంతవరకూ సాఫీగా ఉన్నాయని తెలిపారు. మూడో ఘట్టం పురోగతి సంతృప్తికరం అన్నారు. ఇప్పటివరకైతే ఇంతవరకూ ఎవరూ కనుగొనని విధంగా ఇస్రో పరిశోధనల క్రమంలో ల్యాండర్ ద్వారా చంద్రుడిపై అసాధారణ స్థాయి ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల గురించి కీలక సమాచారం అందింది. టెంపరేచర్‌ల గ్రాఫ్‌ను విక్రమ్ ల్యాండర్‌కు అమర్చి ఉన్న ఛాస్టే సేలోడ్ ద్వారా భూ కేంద్రానికి పంపించారు. చంద్రుడి స్వరూపాన్ని , అక్కడి అంతర్గత పరిణామాలను విశ్లేషించుకునేందుకు ఈ గ్రాఫ్ దోహదం చేస్తుందని సైంటిస్టులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News