ఐపిఎల్ సీజన్18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (41), రవీంద్ర జడేజా (25), ధోనీ 30 (నాటౌట్) తప్ప మిగతా వారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు, దయాల్, లివింగ్‌స్టోన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లిలు శుభారంభం అందించారు. కోహ్లి రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరచగా సాల్ట్ దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ధాటిగా ఆడిన సాల్ట్ 16 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దుత్ పడిక్కల్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ధాటిగా ఆడిన పడిక్కల్ స్కోరును పరిగెత్తించాడు. కానీ 14 బంతు ల్లో రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన పడిక్కల్‌ను అశ్విన్ వెనక్కి పంపాడు.
ఆ వెంటనే కోహ్లి కూడా పెవిలియన్ చేరాడు. సమన్వయంతో ఆడిన కోహ్లి రెండు ఫోర్లు, సిక్స్‌తో 27 పరుగులు చేశాడు. ఇక రజత్ పటిదార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న పటిదార్ స్కోరును పరిగెత్తించాడు. దూకుడును ప్రదర్శించిన పటిదార్ 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. చివర్లో టిమ్ డేవిడ్ 8 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 22 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు స్కోరు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులకు చేరింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, పతిరానా రెండు వికెట్లు తీశారు.