Thursday, January 23, 2025

రాజ్యాలు పోయినా రాజకీయ రాజరికాలే , కులాధిపత్య కోటలే

- Advertisement -
- Advertisement -

జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో పలు ప్రాంతాలలో మాజీ రాజ కుటుంబాలు, కుల రాజకీయాలే ఎక్కువగా గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. రాజ్యాలు పోయినా ఆ వంశాల వారు రాజకీయాల్లో చేరి తమ పెత్తన వారసత్వాన్ని సాగిస్తున్నారు. రాజస్థాన్‌లోని తూర్పు మధ్య ప్రాంతంలోని ధూంధార్ పరిధిలోకి వచ్చే జైపూర్, దౌసా టాంక్, సవాయ్ మాధేపూర్ జిల్లాల్లో రాజరిక కోటలు శిథిలమైనా రాజకీయ రాజరికాలు విలసిల్లుతున్నాయి. ఇక ధూంధార్ ప్రాంతం ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులను తెరపైకితీసుకువచ్చిన గత చరిత్రతో ఉంది. ఇంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న హీరా లాల్ శాస్త్రి, తికా రామ్ పాలీవాల్‌లు రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించారు. అధికార కేంద్ర బిందువులుగా నిలిచారు. ఈ ప్రాంతంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా హోరాహోరిగా పోరుసల్పాల్సిందేనని , పోటీ తీవ్రంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు తెలిపారు. ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగే వారికి తమ వంశానుగత పౌరుషాలు, ఓటమిని అంగీకరించరాదనే పట్టుదలలు మెండుగా ఉంటాయి.

దీనితో ప్రతి ఓటును వీరు తమ అస్త్రశస్త్రాలుగా మల్చుకుంటారు. చివరి దాకా పోరాడుతారు. ధూంధార్ ప్రాంతంలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ తరచూ అధికారం బిజెపి, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతూ వస్తోంది. అత్యంత కీలకమైన జైపూర్ , దౌసాలు , కుల రాజకీయాల ప్రాబల్యం ఉన్న సవాయ్ మాధోపూర్ జిల్లాలు కూడా ఈ ప్రాంతంలోకి వస్తుండటంతో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదీ? కాబోయే సిఎం ఎవరు? అనేది కూడా చివరికి ఈ ప్రాంతమే ఖరారు చేస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలో బిజెపి 11 స్థానాలు , కాంగ్రెస్ 13 స్థానాలను గెల్చుకుంది. ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ సీట్లనే దక్కించుకున్నారు, బిఎస్‌పి, లోక్‌తాంత్రిక్ సమాజ్‌వాదిపార్టీలకు చెరో సీటు వచ్చింది. 2013 ఎన్నికలలో బిజెపి ఈ ప్రాంతంలో ఘన విజయం సాధించింది. 28 స్థానాలు గెల్చుకుంది. కాంగ్రెస్‌కు ఒక్కసీటే వచ్చింది. తరువాత 2018 ఎన్నికల్లో పరిస్థితి తారుమారయింది. కాంగ్రెస్‌కు 20 సీట్లు రాగా, బిజెపికి ఆరు, ఇండిపెండెంట్లకు ఆరు స్థానాలు దక్కాయి.

పట్టణ ప్రాంతాలలో బిజెపికి పట్టు
ఈ ప్రాంతంలో అర్బన్ ప్రజలు ఎక్కువగా బిజెపి పట్ల మొగ్గుచూపుతున్నారు. బిజెపిని బ్రహ్మణ, బనియా పార్టీగా భావిస్తారని, దీనితో జైపూర్ ఇతర చోట్ల పట్టణాలలో బిజెపికి గట్టి పట్టు ఉంటోందని రాజకీయ విశ్లేషకులు నారాయణ్ బరేత్ తెలిపారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుందని, అయితే కాంగ్రెస్‌లో ఈసారి ఎక్కువగా ముఠాతగాదాలు ఉన్నాయని, దీనితో పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని అంచనావేశారు. అయితే బిజెపిలో కూడా అంతర్గత పోరు ఉందన్నారు. ఈసారి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బిజెపి మధ్య పోరు నువ్వానేనా అనే విధంగా ఉందని, అభ్యర్థుల సమర్థత, పార్టీలో సఖ్యతను నిలబెట్టే పార్టీలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రచారం చేయడంపై కాంగ్రెస్ ఆధారపడుతోంది. కాగా ఓటర్లను విభజించి లాభం పొందాలని బిజెపి చూస్తోంది.

జైపూర్ రాజరిక కుటుంబానిదే పెత్తనం
జైపూర్‌ను ఏలిన రాజుల కుటుంబం నుంచి వచ్చిన గాయత్రీదేవి ప్రాబల్యం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. గాయత్రీదేవీ వారసులు ఇక్కడ రాజకీయాధికారం దక్కించుకుంటున్నారు. అప్పట్లో గాయత్రీదేవి స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేయడంతో చాలాకాలం వరకూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వచ్చిన జైపూర్ ఇతర ప్రాంతాలు స్వతంత్ర పార్టీకి జై కొట్టాయి. 1962 ప్రాంతంలో మహారాణి గాయత్రి దేవీ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా చారిత్రక రికార్డు మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌ను గడ్డిపోచతో సమానం చేసేశారు. జైపూర్ నుంచి బిజెపి తరఫున దియా కుమారి ఇక్కడి విద్యాధర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

కుల రాజరిక ప్రభావాన్ని దెబ్బతీసిన గరీబీ హఠావో
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తమ హయాంలో వెలువరించిన గరీబీ హఠావో నినాదం రాజస్థాన్‌లో కుల రాజరిక రాజకీయాల ప్రభావాన్ని చిత్త చేసింది. బడుగు బలహీనవర్గాలను ఏకం చేసి కాంగ్రెస్‌కు తిరుగులేని విధంగా పట్టం కట్టేలా చేసింది. ప్రత్యేకించి రైతులు , కూలీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. తమకు కులాలకు , రాజరిక ప్రాబల్యానికి అతీతమైన శక్తి కావాలని వారు కోరుకున్నారు. దీని ప్రభావం చాలా కాలం వరకూ కాంగ్రెస్‌కు బలం ఇచ్చింది. అయితే దేశంలో ఎమర్జెన్సీ విధింపుతో పరిస్థితి తలకిందులు అయింది. 1977లో జనతాపార్టీ చేతిలో కాంగ్రెస్ చిత్తు అయింది. భైరాన్ సింగ్ షెకావత్ సిఎం అయ్యారు. తరువాత క్రమంలో బిజెపి బలోపేతం అవుతూ వచ్చింది. పలు ప్రాంతాలలో అర్బన్ ఏరియాలు బిజెపికి, పల్లె ప్రాంతాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నాయి. ఇక నగర ప్రాంతాలలోని తటస్థ ఓటర్లు కూడా విజేతలను ఖరారు చేస్తున్నారు. రాష్ట్రంలో గుజ్జర్లు, మీనాలు మద్దతు పార్టీల జయాపజయాలను నిర్ధేశిస్తున్నాయి. అయితే ఈ పరిణామాన్ని కుల పోరుగా కుల సమీకరణగా భావించరాదని, ఇది కేవలం ఆయా వర్గాలకు ఉన్న సామాజిక బలం ప్రత్యేకించి తరాలుగా వీరికి ఉంటూ వస్తున్న అధికార ప్రతిఘటనా వైఖరిని బట్టి వీరు బలం చాటుకుంటున్నారని విశ్లేషకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News