Wednesday, January 22, 2025

రాజస్థాన్‌కు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు పంజాబ్‌తో పోరు
గౌహతి: వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్‌కు ప్లేఆఫ్ బెర్త్ సొంతమవుతుంది. అయితే వరుస పరాజయాలు చవిచూస్తున్న రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలతో జరిగిన చివరి మూడు పోటీల్లో రాజస్థాన్‌కు పరాజయాలు ఎదురయ్యాయి.

చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన రాజస్థాన్ చెన్నై కేవలం 141 పరుగులు మాత్రమే చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ తదితరులు ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపించింది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు చెన్నైపై రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ తదితరులు ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా రాజస్థాన్ బాగానే ఉంది. ఆరంభంలో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టించిన రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి ఆత్మరక్షణలో పడింది.

అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్‌పై గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. చెన్నై, బెంగళూరులతో జరిగిన చివరి రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశ పరిచింది. 12 మ్యాచుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. వరుస ఓటములతో ఇప్పటికే నాకౌట్ రేసుకు దూరమైంది. అయితే మిగిలిన రెండు మ్యాచులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది. ఇందులో ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News