హైదరాబాద్: మరో రెండు రోజుల్లో దేశ, విదేశాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్'(రౌద్రం-రణం-రుధిరం). ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం బుధవారం హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అయ్యింది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గచ్చిబౌలిలో మొక్కలు నాటారు.
ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు. బాహుబలి టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నగ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించిన హీరో జూ.ఎన్టీఆర్..
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలి కోరారు.
తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని, ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని హీరో రామ్ చరణ్ అన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ ను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అభినందించింది.
సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని, సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్ లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Amazing that the Team @RRRMovie including @AlwaysRamCharan @tarak9999 @ssrajamouli garalu and others who have come forwarded to plant saplings on the occasion of release of their movie #RRR as part of #GreenIndiaChallenge initiative.#Respect#Appreciate pic.twitter.com/Yv6xu3cezi
— Santosh Kumar J (@MPsantoshtrs) March 23, 2022
RRR Movie Team plant sapling in Gachibowli