Wednesday, January 22, 2025

విశ్వ‘నాటు’

- Advertisement -
- Advertisement -

స్థానికంగా బాక్సులు బద్దలు కొట్టి ఇంటింటి చిత్రంగా పేరు గడించిన తెలుగు సినిమా RRR (రౌద్రం, రణం, రుధిరం) లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ఆకాశంలో మార్మోగి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు పొందడం మొత్తం భారత దేశానికే, ఆసియా ఖండానికే గర్వకారణం. ‘పాడనా తెలుగు పాట పరవశమై నీ ఎదుట నీ పాట’ అంటూ 1976 లో ‘అమెరికా అమ్మాయి’ సినిమాలో అమెరికన్ అమ్మాయి నోట పాడించిన పాట గుర్తుండే వుంటుంది. ఇప్పుడు అది అనేక రెట్లు ఉన్నతంగా నిరూపణ అయింది. మన ‘నాటు’ పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ విశ్వ వీణనే మూర్ఛపోయేలా చేయడం అత్యంత గణనీయం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాయే రూ. వెయ్యి కోట్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించిందని సమాచారం.

ఈ సినిమా ఆస్కార్ పోటీకి నామినేట్ అయినప్పుడే తెలుగు హృదయాలు పరవశించిపోయాయి. ఇప్పుడు ఈ పాటకు ఇంతటి గౌరవం దక్కడంతో ఆనందం అంబరాన్ని తాకుతున్నది. ‘పొలం గట్టు దుమ్ములోన/పోలేరమ్మ జాతరలో/పోతరాజు ఊగినట్టు/కిర్రు సెప్పులేసుకొని/కర్రసాము చేసినట్టు/ మర్రి సెట్టు నీడలోన/కుర్రగుంపు కూడినట్టు/ఎర్రజొన్న రొట్టెలోన/మిరప తొక్కు కలిపినట్టు అంటూ నాటు నాటుగా గ్రేటు ఫీటుగా సాగిన ఈ పాట భాషలకు, ప్రాంతాలకు, దేశాలకు, ఖండాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరి నోట నర్తించడం సహజాతి సహజం. అదే ఇప్పుడు జరిగింది. ఈ పాటను యుద్ధ బీభత్సాన్ని చవిచూస్తున్న ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నేపథ్యంలో యుద్ధానికి ముందు చిత్రీకరించడం ప్రత్యేకమైన విశేషం. ఒక ప్రాంతీయ సినిమా పాట ఆస్కార్ అవార్డును సాధించి జగజ్జెట్టిగా నిలవడం అసాధారణమైన విశేషం, చరిత్రాత్మకం. రెండే రెండు అక్షరాలతో పల్లవించి అమోఘమైన నాట్య విన్యాసాన్ని రక్తి కట్టించిన ఈ పాట నిజంగానే తిరుగులేని తెలుగు గళంగా నిలిచిపోతుంది.

రామ్ చరణ్, జూ. ఎన్‌టిఆర్‌ల అడుగుల వేగానికి తగ్గట్టు అతి అలతి పదాలతో పాటను రచయిత పరుగెత్తించారు. సంగీతం చేత చిందు వేయించారు. పాట రాసిన చంద్రబోస్, సంగీతం సమకూర్చిన కీరవాణి ఎంతైనా అభినందనీయులు. కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కృషిని మెచ్చకోవలసి వుంది. వంద రకాల నృత్య రీతులను పరిశీలించి నెలల తరబడి రిహార్సల్స్ సాగించిన తర్వాత నాటు నాటును తెరకెక్కించారని ప్రేమ్ రక్షిత్ చెప్పారు. ఈ పాటకి గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు ఇంతకు ముందే లభించాయి.భారత స్వాతంత్య్ర సముపార్జన ఘట్టానికి ముందు 1920ల నాటి అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్), కొమరం భీం (జూ ఎన్‌టిఆర్) అనే చరిత్ర ప్రసిద్ధి పొందిన స్వాతంత్య్ర యోధుల గాథల నుంచి కల్పిత పాత్రలను సృష్టించి తీసిన ఆర్‌ఆర్‌ఆర్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలై విజయాలను చూరగొన్నది. మొట్టమొదటగా 1983లో రిచర్డ్ అటెన్ బరో సినిమాకు ఆస్కార్ ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ అవార్డును భాను అతయ్యా స్వీకరించారు. సత్యజిత్ రే కి 1992లో ఆయన మరణానికి నెల రోజుల ముందు గౌరవ ఆస్కార్‌ను ఇచ్చారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు ఇంత వరకు అవార్డు దక్కలేదు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో ఎఆర్ రెహమాన్ ‘జై హో’ పాటకు ఆస్కార్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు నుంచి వెళ్ళిన ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ కు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డు లభించింది. ప్రకృతిని కాపాడుకుంటూ ప్రగతిని సాధించాలనే సమున్నతమైన సందేశాన్ని ఈ సినిమా ఇచ్చింది. ఈసారి మలేసియా సినిమా ‘ఎవ్వెరిథింగ్ ఎవ్వెరివేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది. అందులో నటించిన మిచెల్లీ ఏహో, కెహుయ్ క్వాన్, జెమి లీ కుర్టిస్‌లకు అవార్డులు లభించాయి. ఆసియా నుంచి మొట్టమొదటి సారిగా ఉత్తమ నటి అవార్డును మిచెల్లీ ఏహోకు దక్కింది. 20 ఏళ్ళ తర్వాత శ్వేతేతర నటికి ఈ గౌరవం దక్కింది. ‘ద వేల్’ లో నటించిన బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడుగా పురస్కారాన్ని పొందారు. ఈసారి ఆస్కార్ కోసం భారత ప్రభుత్వం అధికారికంగా పంపించిన గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ అవార్డులు పొందిన చిత్రాల జాబితాలో లేకపోడం గమనించవలసిన విషయం.

తెలుగు సినిమా రంగంలో ‘బాహుబలి’ నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. దేశాల ఎల్లలు చెరిగిపోయి ప్రపంచమంతా ఒక కుగ్రామ కుటుంబంగా మారిపోయిన తర్వాత సాంకేతిక సాఫల్య నైపుణ్యాలు అందరికీ అందుబాటు లోకి వచ్చిన తర్వాత రాజమౌళి వంటి కొత్త తరహా దర్శకులు తెలుగు చలన చిత్రాలను సరికొత్త శిఖరాలను అధిరోహింప చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ప్రయోగాన్ని, ప్రయోజనాన్ని గుర్తిస్తూ మంచి పోషకులనిపించుకొంటున్నారు. ఈ విజయోత్సవ వేళ ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందాన్ని కూడా మనసారా అభినందిస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News