Thursday, December 19, 2024

హవాలా రాకెట్ గుట్టు రట్టు..

- Advertisement -
- Advertisement -

Rs 1.27 crore Hawala Money seized in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్/గన్‌పౌండ్రీ: హైదరాబాద్‌లో హవాలా రాకెట్ గుట్టును సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రూ.కోటి 27 లక్షల నగదు, టూ వీలర్ ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైమండ్ షోరూం, లిబర్టీ క్రాస్‌రోడ్స్, హిమాయత్ నగర్ వద్ద పోలీసులు ఓ టూవీలర్‌లో హవాలా నగదుని తరలిస్తున్న కె.ఫణి కుమార్ రాజును అదుపులోకి తీసుకున్నారు. రాజును పోలీసులు విచారించారు. తాను కలెక్షన్ బాయ్‌నని రాజు పేర్కొంటూ తాను అంబర్‌పేట గోల్నాకకు చెందిన మన్నె శ్రీనివాస్(ఆపరేటర్) నుంచి రూ.70,00,000, ఉస్మాన్‌గంజ్ ఎంజి మార్కెట్‌కు చెందిన సి.విశ్వనాథ్ చెట్టి నుంచి రూ.57,00,000ల నగదును కలెక్ట్ చేశానని పేర్కొన్నాడు.

ఆ సొమ్మును కవాడిగూడలోని ఒక గుర్తు తెలియని వ్యక్తికి అందజేసేందుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో పోలీసులు మన్నె శ్రీనివాస్, సి.విశ్వనాథ్ చెట్టిలను అదుపులోకి తీసుకుని మొత్తం ముగ్గురిని విచారించారు. భారీ మొత్తంలో నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో భారీగా హవాలా మార్గంలో.. వాహనాల తనిఖీల సమయంలో పోలీసులకు పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతున్న ఘటనలు కోకొల్లలు. హైదరాబాద్‌లో ఈ స్థాయిలో హవాలా రాకెట్ నడుస్తుండటం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా.. ఇటు హైదరాబాద్‌లోనూ పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మునుగోడుకు డబ్బు తరలించే వ్యక్తులు సైతం పోలీసులకు చిక్కిన సంగతి విదితమే.

Rs 1.27 crore Hawala Money seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News