ఆశా వర్కర్లకు ప్రియాంక గాంధీ వాగ్దానం
న్యూఢిల్లీ: అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్(ఆశా) వర్కర్ల సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవమానిస్తోందని, ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు రూ.10000 గౌరవవేతనం(హానరేరియం) ఇస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం వాగ్దానం చేశారు. తమ డిమాండ్లను తెలుపుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని షాజహాన్‌పూర్‌లో కలిసేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిపై దాడి చేసిన వీడియోను ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. “ఆశా సోదరిపై జరిగే ప్రతి దాడి ఓ అవమానమే. కరోనావైరస్ కాలంలో నా ఆశా సోదరీమణులు ఎంతో దృఢ నిశ్చయంతో పనిచేశారు. వారికి గౌరవ వేతనం దక్కడం అన్నది సరైనదే. వారి డిమాండ్లను వినిపించుకోవడం అన్నది ప్రభుత్వం విధి” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఆమె ‘గోశాలల’ స్థితిపై కూడా ఆక్రోశం వ్యక్తంచేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.