Saturday, June 29, 2024

ఐడిఎల్ భూముల్లో హిందూజాదు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కెపిహెచ్‌బి:కూకట్‌పల్లి నగరం నడిబొడ్డులో ఉన్న ప్రాంతం. ఇక్కడ భూమికి ఉన్న విలువ కోకాపేట భూముల విలువకు ఏమాత్రం తీసిపోదు. అంత విలువైన ఈ ప్రాంతంలో ఏడు దశాబ్దాల క్రితం(ఐడిఎల్)ఏర్పాటు కోసం 870. 13 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రభుత్వ భూమితో పాటు రైతులు, ఆధ్మాత్మిక సంస్థల నుంచి సేకరించి పరిశ్రమకు కట్టబెట్టింది. ప రిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకా శా లు కల్పిస్తామనినాడు చిన్న, సన్నకారు రైతుల నుంచి వెయ్యి రూపాయలకు ఎకరం చొప్పున బల వంతంగా తీసుకొని కంపెనీకి అప్పగిం చింది. అయితే.. ఇలా ఇచ్చిన భూమిని ఇతర ప్రయో జనాలకు మళ్ళిస్తున్నారు. ప్రభుత్వ పె ద్దల అండదండలతో నిబంధనలను తుంగలో తొక్కి సదరు కంపెనీ కాసుల పంట పండిం చుకుంటుంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితోపాటు ఎం తో మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తామని న మ్మబలికిన సదరు పరిశ్రమ రెండు దశాబ్దాల నుంచి ఉత్పత్తిని పూర్తిగా తగ్గిస్తూ మూసివేత దశకు తీసుకువచ్చి ఇప్పుడు భూ దందాకు తెరలేపింది.పరిశ్రమను నడపలేకపోతే భూమిని ప్రభుత్వానికి సరెండ్ చేయడమో లేక ప్రభుత్వమే సదరు సంస్థనుంచి భూమిని వెనుక్కి తీసుకోవచ్చన్న నిబంధనలను పూర్తిగా బొంద పెట్టేశారు.

ఐడీఎల్ కంపెనీ పేరుతో ….
1970 సంవత్సరంలో రక్షణ రంగానికి అవసరమైన డిటోనేటర్ల తయారీకోసం ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ ( ఐడీఎల్) పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నగర శివారులోని కూకట్‌పల్లి గ్రామ శివారులోని 870.13 ఎకరాల భూమిని సేకరించి సంస్థకు అప్పగించింది. ఇందులో 181.04 ఎకరాల ప్రభుత్వ భూమికాగా 151.08 ఎకరాల భూమిని చిన్న, సన్న కారు రైతుల నుంచి సేకరించారు. అదికూడా రైతుల నుంచి బలవంతంగానే తీసుకున్నారు. డిటోనేటర్ల తయారీ కంపెనీ వస్తుందని, కంపెనీలో తయారయ్యే బాంబుల టెస్టింగ్ సమయంలో 2 కిలోమీటర్ల వరకు పేలుడు సంభవించే ప్రమాదం ఉందని భయాందోళనకు గురిచేసి ఎకరానికి వెయ్యి, 1200 రూపాయల చొప్పున రైతులకు ఇచ్చి భూ సేకరణ చేశారు.

అత్యంత ప్రమాదకరమైన డిటోనేటర్ల పరిశ్రమ కావడంతో కంపెనీ చుట్టూ బఫర్ జోన్ ఉండాలన్న నిబందన మేరకు నిజాంకాలంలో అప్పటి నైజాంరాజు ఉదాసీన్ మఠంకు ఇచ్చిన 538. 01 ఎకరాల భూమిని 99 ఏళ్ళ లీజు పద్ధ్దతిలో ఏడాదికి 56వేల రూపాయలను మఠంకు చెల్లించే ఒప్పందంతో ప్రభుత్వం అప్పగించింది. పరిశ్రమకోసం పచ్చటి పసిడి పంటలు పండించుకుని జీవనం సాగించే కూకట్‌పల్లి కిచెందిన కుమ్మరి, కమ్మరి, మున్నూరుకాపు, మూసాపేటకుచెందిన యాదవ సామాజిక వర్గాలే త్యాగం చేశాయి. తమకు ఉన్న ఒకటి రెండు ఎకరాలను లాక్కుంటే మేమే ఎలా బతకాలని అప్పట్లోనే బాధితులు ప్రశ్నిస్తే భూమిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఐడిఎల్ కంపెనీలో ఉద్యోగం ఇస్తామన్న గ్యారంటీ ఇచ్చారు. కాని ఏ ఒక్క కుటుంబానికి కూడా కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదని నాటి బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

హిందూజా ప్రవేశంతో క్రమంగా మసక బారిన పరిశ్రమ
ఐడిఎల్ కంపెనీ రెండు దశాబ్దాల పాటు డిటోనేటర్ల తయారీలో అగ్రగామిగా నిలిచినప్పటికి అనేక కారణాల వల్ల 2003 సంవత్సరంలో హిందూజా గ్రూపుకు చెందిన గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టేకోవర్‌ చేసుకుంది. హిందూజా సంస్థ పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచి కంపెనీలో తరచూ ప్రమాదాలు సంభవించడం పదుల సంఖ్యలో కార్మికులు మృతిచెందడం, క్రమంగా సంస్థ తన ఉత్పత్తిని, ఉద్యోగులను తగ్గించుకుంటూ వచ్చిందని అందలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఉత్పత్తి పూర్తిగా తగ్గించి వేయడంతో కంపెనీ కేవలం అలంకార ప్రాయంగా మిగిలి పోయింది. నగర నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన భూములను దృష్టిలో పెట్టుకునే హిందూజా సంస్థ ఐడిఎల్ నుంచి కంపెనీనీ టేకోవర్‌చేసుకుందని రైతు బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాపార , రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అపార అనుభవం కలిగి ఉన్న హిందూజా సంస్థ కూకట్‌పల్లిలో ఉన్న ఎంతో విలువైన భూములపై కన్నేసి వ్యవహారాన్ని చాకచాక్యంగా నడిపించుకుంటూ వస్తొంది.

బెంగుళూరు తరహాలో ‘హిందూజా’ జాదు
బెంగూళూరులోని ఐడిఎల్ కంపెనీనీ స్వాదీనం చేసుకుని అక్కడి భూములతో రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేసినట్లుగానే ఐడిఎల్ కంపెనీనీ హిందూజా స్వాధీనం చేసుకుంది. కంపెనీ నిర్వాహణ కష్టం కావడంతో అక్కడి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టింది. ఇందుకోసం అక్కడ ఎలహంక, చిక్కజాల, నవరత్న అగ్రహారాల్లో భూములను ఓ పద్ధ్దతి ప్రకారం కమర్షియల్ నిర్మాణాలతోఅభివృద్ధ్ది చేసింది. అదే తరహాలో కూకట్‌పల్లి ఐడిఎల్‌కు చెందిన 850 ఎకరాలను కూడా దశల వారీగా అభివృద్ధ్ది చేసి సొమ్ముచేసుకునే వ్యూహాన్ని పన్ని తదనుగుణంగా పావులు కదపడం ప్రారంభించింది స్థానికులు చెబుతున్నారు.
పరిశ్రమను తరలించి.. భూమిని ఎపి ఐఐసికి అప్పగించాలని

2008లోనే కలెక్టర్ నివేదిక
హిందూజా టేకోవర్‌చేసకున్న నాటి నుంచి ఐడిఎల్ కంపెనీలో ప్రమాదాల సంభవించడం సర్వ సాదారణంగ మారింది. డిటోనేటర్ల తయారీ, టెస్టింగ్ సమయంలో పేలుళ్ళు సంభవించి ఎంతో మంది కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్న సమయంలో ప్రభుత్వం 2008లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరింది. ‘ఐడిఎల్ కెమికెల్స్ లిమిటెడ్ కంపెనీనీ 2003లో హిందూజా గ్రూపు కైవసం చేసుకుంది. అప్పటినుంచి కంపెనీ పేరుతో గల్ప్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పేలుడు పదార్థ్ధాలు తయారు చేస్తారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాల వల్ల పరిసరాలు కలుషతం అవుతున్నాయి. ఇక్కడ పేలుడు పదార్థాలను తయారు చేయడానికి 1970———..75 ల్లో అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ భూమితోపాటు రైతుల నుంచి కొంత,

మఠానికి చెందిన భూమిని సేకరించి ఇచ్చారు. ప్రస్తుతం కూకట్‌పల్లి ..మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. జిహెచ్‌ఎంసిలో బాగమైంది. స్థానికంగా జనాభా పెరిగి కాలనీలు చుట్టూ విస్తరించాయి. ఈ పరిశ్రమలో తరచూ జరుగుతున్న ప్రమాదాల వల్ల స్థానికుల ప్రాణాలకు, ఆస్తికి ముప్పు పొంచి ఉంది. వాస్తవానికి ఈ పరిశ్రమ ఆధీనంలో 850 ఎకరాలు ఉంది. సంస్థ యాజమాన్యం పరిశ్రమ కోసం వినియోగిస్తున్న భూమి కేవలం 10 ఎకరాలు మాత్రమే. పరిశ్రమ వల్ల తలెత్తే ముప్పును దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఇక్కడి నుంచి తరలించాలి. మరోవైపు భూములను ఎపి ఐఐసి కి అప్పగించాలి. రంగారెడ్డి జిల్లా శివారులో కాని, ఇతర జిల్లాల శివారులో ఎక్కడైనా పరిశ్రమకు అవసరమైన భూమిని అందించాలి’ అని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు.

కలెక్టర్ నివేదికకు విరుద్ధ్దంగా వైఎస్
కూకట్‌పల్లిలో అత్యంత ప్రమాదకరంగా మారిన డిటోనేటర్ తయారీకి సంబంధించిన గల్ప్ ఆయిల్ కార్పొరేషన్ పరిశ్రమను తరలించి, భూములను స్వాధీనం చేసుకోవాలన్న అప్పటి కలెక్టర్ నివేదికను వైఎస్ ప్రభుత్వ హాయంలో బుట్ట దాఖలు అయింది. అదే సమయంలో హిందూజా అసలు వ్యూహానికి పదును పెట్టింది. కలెక్టర్ నివేదికకు భిన్నంగా హిందూజా తీసుకువచ్చిన సరికొత్త ప్రతిపాదనలను అప్పటి ప్రభుత్వం పరిశీలించింది. వైఎస్ ప్రభుత్వం నుంచి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలిదశలో కంపెనీకి చెందిన వంద ఎకరాల భూమిని పారిశ్రామికేతర అవసరాల కోసం వినియోగించుకోవడానికి అనుమతులు ఇస్తూ 2009 ఫిబ్రవరి 26 జీవో నెంబరు 302ను విడుదల చేసింది. గమ్మత్తైన విషయం ఏమంటే జిఒ జారీ చేసిన సమయంలో అందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా అంటూ ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. భూములపై కన్నేసే ఐడిఎల్ నుంచి హిందూజా స్వాధీనం చేసుకున్నదని అప్పట్లో కార్మికులు, కార్మిక సంఘాలు, రైతులు చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. ఈ జిఒతో కంపెనీ పేరుతో హిందూజా వేసుకున్న ‘ రియల్ దందా’ ముసుగు తొలగినట్లైంది.

జిఒ వచ్చిన 12 ఏళ్ళ తరువాత కార్యరూపం
2009లో వైఎస్ హాయంలో జిఒ వచ్చినా అది కార్యరూపం దాల్చడానికి రాష్ట్రంలో మారిన అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో హిందూజా సంస్థకు 12ఏళ్ళు పట్టింది. జిఒ ఇచ్చిన కొద్ది రోజులకే ఎన్నికల జరగడం.. తదనంతరం వైఎస్ మృతిచెందడం.. తరువాత పాలన బాధ్యతలుచేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఫైల్‌ను ముట్టుకోవడానికి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాహసించలేదని సమాచారం. రాష్ట్ర ఆవిర్భావం తరువాత వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో ఫైల్ చూడటానికి కూడా ఇష్టపడలేదని అంటున్నారు. రెండో టర్మ్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత 2022లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జిఒ నెంబరు ౩౦2 ఆధారంగా కంపెనీకి చెందిన 100 ఎకరాలను పారిశ్రామికేతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి అనుమతులు జారీ చేసింది. దీని ఆధారంగా హిందూజా దేశంలోనే పేరిన్నికగన్న 14 నిర్మాణం సంస్థలకు లే అవుట్ చేసి భూములను అప్పగించడం… సదరు నిర్మాణ సంస్థలు వేగంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతుల పొంది విలాలతోపాటు ,హైరైజ్డ్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జోరుగా చేపడుతున్నాయి.

మా భూములు మాగ్గావాలె…!
కంపెనీకోసం భూములిచ్చి త్యాగం చేసిన రైతు వారసుల పోరుబాట
( ఫోటోరైటప్‌ః 26కేపీహెచ్‌బి01,02,03లలో కమ్మరి నాగప్ప, కుమ్మరి దాసు, శామీర్‌పేట రంగయ్య )
‘బాంబులు తయారు చేసే కంపెనీ పెడుతున్నాం. ఉద్యోగాలిస్తాం… మీ భూములివ్వండి అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అంతేకాదు.. మేము ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో బలవంతంగా మా భూములను లాక్కున్నారు. భూమిచ్చిన ప్రతి కుటుంబంలో ఒకరికి కంపెనీలో ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. పచ్చటి పసిడి పంటలు పండించుకుని జీవనం సాగించే మా బతుకులల్ల బాంబు పడ్డటైంది. కుండులు చేసుకుంటూ … కమ్మరి పనిచేసుకుంటూ జీవనం సాగించే మా తాతలు, తండ్రులు చమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న భూములను లాక్కొని అప్పటి ప్రభుత్వం కంపెనీకి కట్టబెట్టింది. ఇప్పుడు అదే కంపెనీ తమ కళ్ళ ముందే ఎకరానికి వంద కోట్ల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి.

కంపెనీ నడవక పోతే తమ భూములను తమకు ఇవ్వాలని గత మూడు దశాబ్దాలుగా మేము పోరాడుతున్నాం. వైఎస్ హాయంలో వచ్చిన జిఒ 302కు వ్యతిరేకంగా మేము పోరాటం సాగిస్తున్నాం. బిఆర్ ఎస్ ప్రభుత్వం జిఒకు చట్టబద్ధ్దత కల్పించి రైతుల నుంచి తీసుకున్న భూముల్లోనే నిర్మాణ రంగానికి అనుమతించడంతో తాము హైకోర్టు ప్రజా ప్రయోజన పిటీషన్‌ను దాఖలుచేశాం. ’ అని కూకట్‌పల్లి చెందిన బాధిత రైతు వారసులు కమ్మరి నాగప్ప, కుమ్మరి దాసు, శామీర్‌పేట రంగయ్యలు ‘మనతెలంగాణ’ ప్రతినిధితో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. కూకట్‌పల్లిలో డిటోనేటర్లను తయారుచేసే ఐడిఎల్ కంపెనీని హస్తగతం చేసుకున్న హిందూజా గ్రూపు తాజాగా గల్ప్ ఆయిల్ భూముల్లో చేపడుతున్న రియల్ దందా వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపిస్తున్నారు.పై నుంచి కిందిస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులకు , పార్టీలకు పెద్ద ఎత్తున భారీ ప్యాకేజీలు, విల్లాలు ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కంపెనీ చేపడుతున్న రియల్ దందాను ప్రశ్నించక పోగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వక పోవడమే ఇందుకు నిదర్శనమని బాధితులు ఆరోపిస్తున్నారు.

హిందూజా రియల్ దందాపై బాధితుల న్యాయ పోరాటం
తమ వద్ద నుంచి కంపెనీ పేరుతో బలవంతంగా లాక్కున్న భూముల్లో నిబంధనలకు విరుద్ధ్దంగా చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాపై కూకట్‌పల్లికి చెందిన బాధిత రైతు కుటుంబాలు న్యాయ పోరాటానికి దిగాయి. ఏ రాజకీయ పార్టీ నుంచి గాని, నాయకుడి నుంచి వారికి మద్దతు లభించక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హిందూజ కంపెనీలతోపాటు , సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్లతోపాటు సంబంధం కలిగి ఉన్న సంబంధిత 15 సంస్థలను ప్రతివాదులగా చేస్తూ తెలంగాణ హైకోర్టులో (11908/2023)ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పరిశ్రమకు కేటాయించిన భూమిలో వంద ఎకరాలను పారిశ్రామికేతర అవసరాలకు కన్వర్టు చేసిన వ్యవహారంలో లక్ష కోట్ల పైగా స్కాం జరిగిందని బాధితులు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఎకరం వంద కోట్ల రూపాయలు పలుకుతుందని, కంపెనీ నుంచి వంద ఎకరాల భూమిని తప్పించి హిందూజా సంస్థ ఇతర అవసరాలకు ఉపయోగించడానికి అనుమతి ఇవ్వడంతో సదరు సంస్థ లక్ష కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి వీలు కల్పించినట్లైందని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల వ్యవహారంలో రాజకీయ పార్టీలకు, నాయకులకులకు, ప్రజా ప్రతినిధులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని పిటీషన్‌లో బాధితులు ఆరోపించారు. దీనిపై సిబీఐ, ఈడి వంటి సంస్థలతో దర్యాప్తు జరిపంచాలని పిటీషన్‌లో బాధితులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News