Saturday, November 23, 2024

రూ. 100కోట్లతో ఓఆర్‌ఆర్‌పై లైటింగ్ ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

 ఈ ఏడాదిలో మరో రెండు ఇంటర్ చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం
 హెచ్‌ఎండిఏ సెక్రటరీ, హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ లిమిటెడ్ ఎండి బి.ఎం.సంతోష్

మనతెలంగాణ/హైదరాబాద్: వందకోట్లతో ఓఆర్‌ఆర్‌పై లైటింగ్ ప్రాజెక్టుతో పాటు ఈ ఏడాదిలో మరో రెండు ఇంటర్ చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నామని హెచ్‌ఎండిఏ సెక్రటరీ, హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జిసిఎల్) ఎండి బి.ఎం.సంతోష్ (ఐఏఎస్) పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అమీర్‌పేట హెచ్‌ఎండిఏ ప్రధాన కార్యాలయంలో విభాగాల అధిపతులతో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆలోచనలకు అనుగుణంగా హెచ్‌ఎండిఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ మార్గదర్శకంలో హెచ్‌ఎండిఏ అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ప్లానింగ్, అర్భనైజేషన్, గ్రీనరి డెవలప్‌మెంట్ విషయంలో పురోగతి సాధించామన్నారు. 42 మంది ఉద్యోగులకు కమిషనర్ అర్వింద్‌కుమార్ పదోన్నతులు కల్పించి ప్రోత్సహించారన్నారు. ఉద్యోగుల సంపూర్ణ భాగస్వామ్యంతో హెచ్‌ఎండిఏ, హెచ్‌జిసిఎల్ కార్యక్రమాలకు ప్రజల్లో ఆదరణ లభిస్తుందన్నారు. నగరానికి మణిహారంగా ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)ను మరింతగా ఆధునీకరించాలన్న సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల ఆదేశాలకు లోబడి రూ.100 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్ లైటింగ్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై మరో రెండు ఇంటర్‌చేంజ్ నిర్మాణ పనులను ఈ ఏడాదిలో చేపడతామన్నారు.

ప్రస్తుతం ఉన్న 19 ఇంటర్‌ఛేంజ్‌లలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. కోవిడ్ కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ గతేడాది హెచ్‌ఎండిఏ గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. మంత్రి కెటిఆర్ ఆలోచనల మేరకు కోకాపేట్ వద్ద వరల్డ్ క్లాస్ లే ఔట్ ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయని ఇప్పటికే మంగళపల్లి లాజిస్ట్రిక్ పార్కు వినియోగంలోకి వచ్చిందన్నారు. బాటసింగారం లాజిస్టిక్ పార్కు ప్రారంభం అవుతుందని అర్భన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 16 అర్భన్ ఫారెస్ట్రీ బ్లాకులు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ట్యాంక్‌బండ్ బ్యూటీఫికేషన్, నెక్లెస్‌రోడ్డు, పనులు పూర్తికావస్తున్నాయన్నారు. ఉప్పల్, మెహిదీపట్నం వద్ద స్కై వే పనులు జరుగుతున్నాయని కొద్ది నెలల్లోనే ఈ రెండు స్కైవేలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అర్భన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ (ఐఎఫ్‌ఎస్), చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి, డైరెక్టర్ ప్లానింగ్ శివశరణప్ప, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శరత్‌చంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, డిఎస్పీ జగన్, ఓఎస్డీ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Rs 100 Cr Lighting Project on Hyderabad’s ORR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News