Wednesday, January 22, 2025

ఆటోవాలాకు రూ. 100 కోట్ల కానుక

- Advertisement -
- Advertisement -

మళ్లీ అధికారంలోకి రాగానే రూ.1200 ఫిట్‌నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు

మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్/జనగామ,నకిరేకల్, నల్గొండ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆటోవాలాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. రేయింబవళ్ళూ కష్టపడి ఆటోలు నడుపుతూ ఎన్నో ఇబ్బందులతో కుటుంబాలను నడుపుకొంటున్న ఆటో కార్మికులకు భారంగా ఉన్న ఫిట్‌నెస్ ఫీజులను, వాటి బకాయిలను రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది ఆటోవాలాలు ఉన్నారని, వారందరికీ ఆటోల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు ఏటా రూ.62 కోట్లు అవసరమని, వాటికి తోడు బకాయిలు ఉన్నాయని, ఈ మొత్తం దాదాపు రూ.100 కోట్ల వరకు అవుతుందని తెలిపారు. వాటన్నింటినీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించారు. అంతేగాక రాష్ట్రంలోని ఇల్లు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇచ్చి తీరుతామని, రానున్న అయిదేళ్ళల్లో ఒక ఉద్యమం మాదిరిగా ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలే ఉండకూడదని, అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రథమ శత్రువు కాంగ్రెస్సే : కెసిఆర్
జనగామః అప్పుడు.. ఇప్పుడు తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని చాగల్లు శివారులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినపుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కావాలి. 75 ఏళ్ల కాలం తరువాత కూడా ప్రజలకు రావల్సినంత పరిణతి రాలేదు. ఓటు మీ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ నిర్ణయిస్తాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభ్యర్థి ఉంటారు. అభ్యర్థులతో పాటు వారి వెనకాల ఉన్న పార్టీ చరిత్ర, దృక్పథం, వైఖరి చూస్తే రాయి ఏదో.. రత్నం ఏదో తెలుస్తుందన్నారు. నా కంటే గొప్ప ఉద్యమకారులు మీ నియోజకవర్గంలో ఉన్నారు.. మన పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం అన్నారు. మనం 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం. ఇంతకు ముందు ఎలా ఉంది.. నేడు తెలంగాణ ఎలా ఉంది  అనేది చూడాలన్నారు.

2004లో మనం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకన్నాక మనల్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ రాష్ట్ర యాత్రనా అని నేను చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చాను. 33 పార్టీలు ఆమోదం తెలిపి నాకా దిక్కు లేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు.. నష్టాలు ఉండే. ఈరోజు పింఛన్లు ఎంత ఉన్నాయి.. నాడు ఎంత ఉన్నాయి ఆలోచన చేయాలి. పింఛన్ ఎంత ఇవ్వాలని.. ఎందుకు ఇవ్వాలని ఆ రోజుల్లో నేను అడిగి తెలుసుకున్నాను. బిర్యాని పెట్టకపోయినా వారి అభివృద్ధికి దిక్సూచిగా ఉండాలని నాడు రూ. 1000 చేశా. నేడు మళ్లీ మన ప్రభుత్వం రాబోతుంది రూ. 5000 చేయబోతున్నాం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. గ్రామాల్లో చర్చ జరగాలి నల్ల ఏదో.. తెల్ల ఏదో తెలియాలి. మాణిక్యాపురం అనే గ్రామంలో చుక్క సత్తయ్య అనే ఒగ్గు కళాకారుడు 50 బోర్లు వేస్తే ఒక్క బోరు పడలేదు. ఆయనకు ఒగ్గు కథ మీద వచ్చిన డబ్బులు అన్ని బోరు పొక్కల్లో పోశారు. మీ నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సస్య శ్యామలంగా నీరు అందుతుంది. మిషన్ కాకతీయ కింద చెరువులను మంచిగా చేసుకున్నాం. చెక్‌డ్యాంలు పెట్టుకొని నీటిని ఆపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. రైతు బంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతులు పండించిన పంటను కొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ. మళ్లీ మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నీళ్లు లేవు.. కరంటు లేదు.. బలిసినోడు బలిసిండు ఏమీ లేని వాడు ఆగమై పోయిండు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్‌టీఆర్ ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టాడు. రెండు రూపాయలకు బియ్యం పేదలకు ఎందుకు ఇచ్చాడు. రైతు బంధు ఉండాలి అంటే కడియం శ్రీహరిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే ధరణి తీసేసి భూ మాత పెడతామంటున్నారు. భూ మాతనా.. భూ మేతనా.. అని ఎద్దేవా చేశారు. ధరణి ప్రకారం ప్రభుత్వానికి గల అధికారం తీసి మీ బొటనవేలుకు ఇచ్చాం. రాష్ట్ర సీఎంకి కూడా లేని అధికారం ధరణి ద్వారా మీకు ఇచ్చాము. ఆ అధికారం మీరు కాపాడుకుంటారో లేదో, మీ ఉద్యమ బిడ్డగా మీకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి చెబుతున్నానని అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని బాజాప్తా చెప్పాను. కరోనా సమయంలో రాష్ట్ర పరిస్థితి బాగోలేక కొంత సమయం లేట్ అయింది. 90 శాతం రుణమాఫీ పూర్తి చేసాము. మిగతాది కూడా చేస్తాం అన్నారు.
రాజయ్యను చిన్నచూపు చూడము..
టికెట్ కడియంకు ఇచ్చామని రాజయ్యను చిన్నచూపు చూడము ఆయనకు మంచి స్థానం కల్పిస్తామన్నారు. కడియం గెలిస్తే ఘన్‌పూర్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కావాలని, విద్యా సంస్థలు కావాలని అడిగారు అదేమీ పెద్ద మిషయం కాదు అన్ని చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మనం మాట ఇచ్చాం వారిని కూడా ప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, సిరికొండ మధుసూదనచారి, బోనగిరి ఆరోగ్యం, పాగాల సంపత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి కృషిచేసినం : కెసిఆర్
తిమ్మాపూర్(మానకొండూర్): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమానికి ఎంతో కృషి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాధ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశామని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75ఏళ్లు గడిచినప్పటికీ ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పార్టీ మీటింగులు ఉండవనీ, కేవలం టీవీల్లో మాత్రమే చూసి ఓటు వేస్తారని అన్నారు. ఓటు అనేది ఎంతో గొప్పదనీ, ఓటు హక్కును వినియోగించుకోవడంలో తప్పు జరిగితే ఓటు మనను కాటేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి ఓటు వేయాలనీ, పార్టీల తరుపున పోటీచేసే అభ్యర్థుల గుణగణాలను సైతం ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

దేశాన్ని చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణలో పోటీ చేసేందుకు మళ్లీ వస్తుందనీ, అధికారంలోకి వచ్చేందుకు వాళ్లు చేసే అబద్దపు వాగ్ధానాలను ప్రజలు గ్రహించాలని సీఎం కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకోస్తామని చెపుతున్నారనీ, అసలు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు కనీసం తిండి దొరికిందా..? అని ప్రశ్నించారు. ఆ కాలంలోనే ఎన్టీఆర్ సీఎంగా గెలిచి, పేదల కోసం రూ.2కే కిలో బియ్యం అందజేసి, పేదలకు అన్నం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు అప్పులన్నీ చేసింది కాంగ్రెస్సేననీ, వారి పాలనలోనే దేశం అప్పులపాలయ్యిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అక్రమ అరెస్టులు, ఎమర్జెన్సీని చూశామనీ.. అలాంటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని ఆవేదన చెందారు. మూడోసారి అధికారంలోకి వస్తే గ్రామాల్లో ఇల్లు లేని కుటుంబమే లేకుండా చేస్తామని భరోసానిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తామన్నారు. ఆటోరిక్షా యజమాలను ఓ శుభవార్త చెపుతున్నానంటూ ఆటో ఫిట్‌నెస్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో తక్కువ ఆదాయమున్న కుటుంబాలకు అండగా ఉంటూ ఆదుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ దళారీల రాజ్యమే వస్తుందనీ, బీజేపీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే కాబట్టి తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. రసమయిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మళ్లీ మానకొండూర్‌కు వచ్చి దళితబంధు పథకాన్ని నియోజకవర్గంలోని అందరి దళితులకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, తుమ్మనపెల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యులు శైలజ జితేందర్ రెడ్డి, ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి నల్లగొండకు చేసిందేంటి : కెసిఆర్
నల్లగొండ: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే హక్కు ఓటు. ఆ ఓటు సద్వినియోగం అయితే రాష్ట్రానికి మీకు, అందరికీ మంచి జరుగుతుంది. ఒక వేళ అది దుర్వినియోగం అయితే చాలా పెద్ద అవస్తలు వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తును, నల్లగొండ భవిష్యత్తుతో పాటు ప్రజలందరి భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటే కాబట్టి ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటేసే ముందు అభ్యర్ధుల గుణగణాల గురించి, అభ్యర్ధుల వెనకాల ఉన్న పార్టీల గురించి, ఆ పార్టీల దృక్పథం గురించి, పార్టీల చరిత్ర గురించి లోతుగా ఆలోచించాలని అంటూనే రాయేదో రత్నమేదో గుర్తెరగాలని సూచించారు. గతంలో నల్లగొండలో కేవలం ఆముదం పంటలే ఉండేవి అని అంటూనే నల్లగొండ లో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయని, అప్పటికీ ఇప్పటికీ జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనబడుతుందన్నారు. గత పాలకుల హయాంలో బ్రతుకుదెరువు కోసం నల్లగొండ నుండి హైద్రాబాద్ కు వలసలు భారీ గా ఉండేవని, గతంలో నల్లగొండ కు కనీసం తాగు నీళ్ళు కూడా ఉండేవి కావని గుర్తుకు చేశారు. నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండను 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడని అంటూనే నల్లగొండ కు ఐటీ హబ్ తీసుకొచ్చాడని అన్నారు.

నల్లగొండ నియోజకవర్గానికి గత 20 ఏళ్ళుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండి ఏం అభివృద్ధి చేశాడని సూటిగా ప్రశ్నించారు. రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఉండాలంటే రెండవ సారి భూపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బంధు దండగని ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో వైపు 3 గంటల కరంట్ చాలని, 3 గటల కరంట్ తో పొలాలు పారాలంటే 10 హెచ్‌పి మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని అంటూనే 3 గంటల కరంట్ తో పొలం పారుతుందా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. అంతే కాకుండా ధరణిని తీసివేస్తామని, ధరణి స్థానంలో కాంగ్రేస్ భూమాత తెస్తామని కాంగ్రేస్ అంటుందని అంటూనే కాంగ్రేస్ ది భూమాత నా లేక భూమేత నా అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. నల్లగొండ లో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చామని గుర్తుకు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రేలాపనలు, అవాకు చవాకులు మానుకోవాలని అంటూనే ప్రజలను బెదిరించే నాయకులు మనకు అవసరమా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. భూపాల్ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నాడని, ఉంటాడని అన్నారు. నల్లగొండ ఇంకా తన దత్తతలోనే ఉందంటూ నల్లగొండకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. నల్లగొండ ను కేవలం పట్టణంగా కాకుండా ఒక నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నల్లగొండ లో రెండవ సారి కూడా భూపాల్ రెడ్డిని గెలిపించండి… నల్లగొండను అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని భరోసానిచ్చారు.
నకిరేకల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుంది : కెసిఆర్
నకిరేకల్ ః నకిరేకల్‌లో ఏ ఎమ్మెల్యే అయితే గెలుస్తడో… రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తదని, ఆ ప్రభుత్వం మంచిదైతే మనకు మంచి జరుగుతుంది, ఒకవేళ ఆ ప్రభుత్వం బాగొలేకపోతే అయిదేండ్లు ఏడవాలె… అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈనెల 30వ తేదీనాడు ఓట్లు పడతాయని, డిసెంబర్ 3వ తారీఖునాడు లెక్కబెడతరు… అంతటితో కథ అయిపోయిందనుకుంటరు… కానీ కథ అయిపోదు… అప్పుడే కథ మొదలైతదని కెసిఆర్ అన్నారు. ఇక్కడ (నకిరేకల్) ఏ ఎమ్మెల్యే గెలుస్తడో ఆ ఎమ్మెల్యేకు చెందిన పార్టీయే అదికారంలోకి వస్తుందనేది చారిత్రకంగా నిరూపితమైన సెంటిమెంట్ అని అన్నారు. అందుకే ఆలోచించి, జాగరూకతతో ఓటు వేయాలని కోరారు. ఓట్లు వేసేటప్పుడు ఎవడో చెప్పిండనో… మా చుట్టపోడు చెప్పిండనో… ఇంకో రకంగానో ఓట్లు వేయవద్దని కోరారు. గ్రామాలకు పోయిన తర్వాత బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చర్చ పెట్టండి, నిజానిజాలు తెలిస్తే మంచిదని మీ అందరికీ మంచిదని కోరుతున్నానన్నారు.

నల్గొండ జిల్లా వట్టికోట ఆళ్వారు స్వామి పుట్టిన జిల్లా. నర్రారాఘవ రెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ. బాగా చైతన్యముండే ప్రాంతమని నా విశ్వాసం..మీ అందరిని ఒకటే కోరుతున్నా ఎలక్షన్లు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఆలోచించి ఓటు వేయండని కోరారు. 75 సంవత్సరాల భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావాలో అంత పరిణతి ఈరోజుకు కూడా ఇంక రాలేదు. మీ అందరిని నేను కోరేది ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావొద్దు. ఎలక్షన్లు వస్తే ఆలోచనతోని, వివేచన తోని ఓటేస్తే మనకు మంచి జరుగుతుందన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు.. ఆ ఓటు చాలా ముఖ్యమైంది. ఆ ఓటు ఐదు సంవత్సరాల నీ యొక్క, నకిరేకల్ నియోజక వర్గం యొక్క మరియు రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తది.. కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని నేను మనవి చేస్తున్న అని కెసిఆర్ అన్నారు. బ్రాహ్మణ వెల్లెం ప్రాజెక్టు పూర్తయితే రాబోయే ఐదారునెలల్లో ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అది నా బాధ్యతగా చెబుతున్నానన్నారు. కాళేశ్వరం లింకు చేసి భువనగిరి దగ్గర కట్టినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి రామన్నపేట ప్రాంతానికి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. రామన్నపేట చాలా కరువు ప్రాంతం నాకు తెలుసు. ఇయ్యన్ని మేం చేసినం..అని కెసిఆర్ అన్నారు. చిరుమర్తి లింగయ్య గెలిస్తే రైతు బంధు 16 వేల రూపాయలు అవుతుందని మనవి చేస్తున్న అని సిఎం కెసిఆర్ అన్నారు. 24 గంటలుండాలన్నా ్త లింగయ్య గెలవాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని కమ్యూనిస్టులు పార్టీలకు చెందిన వారు కూడా బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిఎం కెసిఆర్ కోరారు.

Auto

భూమాత కాదు.. భూమేత!

ధరణిని రద్దుచేసి ‘భూమాత’ను తెస్తమంటున్నరు కాంగ్రెసోళ్లు. అది భూమాత కాదు.. భూ‘మేత.’ రైతులకు, కౌలుదార్లకు జుట్లు జుట్లు ముడేసి పంచాయతీ పెట్టించి పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. ఇప్పుడు ధరణివల్ల ఎట్ల ఉందో ఆలోచించాలి.. పైసా లంచం లేకుండా.. పైరవీలు లేకుండా రైతు బంధు మీ ఖాతాల పడుతున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News