మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధి పరచడంతో పాటుగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రెండవ దశలో మరో వెయ్యికోట్ల రూపాయల మేరకు రుణ సదుపాయాన్ని కల్పించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, వైస్ చైర్మన్ దీటి మల్లయ్య తెలిపారు. గురువారం నాడు ఢిల్లీలోని ఎన్సీడీసీ ప్రధాన కార్యాలయంలో పిట్టల రవీందర్, ధీటి మల్లయ్యలు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ పిళ్లై ,డిప్యూటీ డైరెక్టర్ పాటిల్ నీలేష్ సురేష్ ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధికి ఎన్ సిడిసి సంస్థ అందించిన సుమారు 600 కోట్ల రూపాయల రుణ సదుపాయాన్ని రాష్ట్రంలో మత్స్య కారుల సంక్షేమానికి, మత్స్య రంగం అభివృద్ధికి, ఈ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించడం ద్వారా నిర్దేశించిన ఫలితాలను సాధించిన నేపథ్యంలో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని ఎన్ సిడిసి అధికారులకు వివరించారు. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ద్వారా ఎన్ సిడిసి రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో మొదటి దశలో అమలు జరిపిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా సుమారు ఒక లక్ష 18 వేలమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా లబ్ది చేకూరిందని ఫెడరేషన్ నాయకులు అధికారులకు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ అమలు జరిపిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ఉత్తమమైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో తమ సంస్థ ద్వారా మరో వెయ్యికోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్సీడీసీ ఉన్నతాధికారులు ఫెడరేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తే రుణ సదుపాయాన్ని వెంటనే అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలను సిద్ధం చేసి, త్వరలో నిర్వహించనున్న పాలకమండలి సమావేశంలో అవసరమైన నిర్ణయం తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో రుణ సదుపాయం కోసం నివేదికలను అందజేస్తామని ఎన్ సి డి సి అధికారులకు ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, వైస్ చైర్మన్ దిటి మల్లయ్య హామీ ఇచ్చారు.