Sunday, December 22, 2024

రుణమాఫీకి త్వరలో మరో రూ.12వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీకి రూ. 19వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, మరో రూ.12 వేల కోట్లు మం జూరు చేసి త్వరలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.జిల్లా, పరకాల పట్టణంలో రూ.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, రూ.11.74 కోట్లతో అమృత్ 2.0 పథకానికి సంబంధించిన పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయనకు స్థానిక ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారదా ప్రావీణ్య తదితరులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆవరణలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు, కొనాయిమాకుల ప్రాజెక్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, గ్రీన్‌ఫీల్డ్ హైవే తదితర అంశాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ..నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు అభివృద్ధి అంశాలపై సమీక్షించినట్లు చెప్పారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి, రూపురేఖలు మారనున్నాయని అన్నారు. ఇటీవల కొరియా పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి టెక్స్‌టైల్ పార్క్‌కు సంబంధించి పెద్ద కంపెనీలతో చర్చలు జరిపారని, ఆయా సంస్థల ప్రతినిధులు కొద్దిరోజుల్లో ఇక్కడ పర్యటించి టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమలు స్థాపించడానికి సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇది శుభవార్త అని అన్నారు. వరంగల్, హన్మకొండ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం విలువైన భూములు అనేది వాస్తవమని, ప్రజలకు, రైతులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామన్నారు. ఇప్పటికే హైవే కోసం భూములు ఇచ్చిన రైతులకు 40 శాతం వరకు పరిహారం అందించినట్లు పేర్కొన్నారు.

మిగతా పరిహారాన్ని అందించేందుకు స్థానిక శాసనసభ్యులు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి రాబోయే కొద్దిరోజుల్లో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం కావాల్సిన మొత్తం ఏరియాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌హెచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేయనున్నట్లు తెలిపారు. పరకాల ఆసుపత్రిలో భవనం పైపెచ్చులు ఊడిపడుతూ ప్రమాదకరంగా మారిందని స్థానిక ఎంఎల్‌ఎ, అధికారులు చెబుతున్నారని, వెంటనే పాత ఆసుపత్రిని తరలించి వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మంజూరైన 11 కోట్ల రూపాయలతో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు, డ్రైనేజీ, తదితర అభివృద్ధి పనులను పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రగతి నివేదికతో చేపడితే బాగుంటుందని అన్నారు. వరంగల్ ఎంపి కడియం కావ్య మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అనిత, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంఎల్‌సి బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లి ఎంఎల్‌ఎ గండ్ర సత్యనారాయణ రావు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News