రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం రూ. 12,393 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది (2024 -25) రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం రూ. 11,468 కోట్లు(3.9 శాతం) కేటాయించారు. ఈ సంవత్సరం 3,04,965 కోట్ల బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు(4.06 శాతం) ప్రతిపాదించారు. 2023 డిసెంబర్ నుండి, ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద 1,215 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది గత సంవత్సరాల కేటాయింపు కంటే 50 శాతం అధికం. దీని ద్వారా, 2.84 కోట్ల మంది పౌరులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా, ఉచిత డయాలిసిస్ సేవలు అందించబడుతున్నాయి. ఈ సేవలను మరింత విస్తరించేందుకు వీలుగా 95 కొత్త డయాలిసిస్ కేంద్రాలను మంజూరు చేసినట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అత్యవసర వైద్య సహాయాన్ని బలోపేతం చేయడానికి, అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఆరోగ్య శ్రీ నిధులు పెంపు
రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి ఆరోగ్యశ్రీ నిధులు పెరిగాయి. గత బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,065 నిధులు కేటాయించగా, ఈసారి రూ.1,143 కోట్లు ప్రతిపాదించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో చేసే చికిత్సల రేట్లను సవరించిన నేపథ్యంలో ఇహెచ్‌ఎస్‌కు రూ.580 కోట్లు పెంచారు.తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అప్‌గ్రెడేషన్ కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.164 కోట్లు కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ.530 కోట్లు , నర్సింగ్ కాలేజీల నిర్మాణం కోసం రూ.187 కోట్లు కేటాయించారు. మందుల కొనుగోలుకు టిఎస్‌ఎంఎస్‌ఐడిసికి రూ.3.72 కోట్లు ప్రతిపాదించారు. ఆరోగ్యశ్రీకి వైద్యారోగ్యశాఖ బడ్జెట్‌లో గతేడాది 3.4 శాతం కేటాయిస్తే ఈ ఏడాది 8 శాతం కేటాయించడం విశేషం. కొత్త నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి రూ.260 కోట్లు కేటాయించారు.