Thursday, January 23, 2025

నెల రోజుల్లో రూ.1726 కోట్ల వేజ్ బోర్డు బకాయిలు

- Advertisement -
- Advertisement -

సింగరేణి ఉద్యోగులకు చెల్లింపునకు సిఎండి శ్రీధర్ భరోసా
రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.05 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలని పిలుపు
ఏరియాల జిఎంల సమీక్ష సమావేశంలో సిఎండి శ్రీధర్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి ఉద్యోగులకు నెల రోజుల్లో రూ. 1726 కోట్ల వేజ్ బోర్డు బకాయిలు, ఆ వెంటనే లాభాల వాటా రూ.700 కోట్లు, దీపావళి బోనస్ మరో రూ. 300 కోట్లు చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ తెలిపారు. మొత్తం మీద దాదాపు 2800 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేయనున్నామని వెల్లడించారు. సగటున ఒక్కో కార్మికుడికి సుమారు రూ.6.5 లక్షల అందుకోనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ బాగా పనిచేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సిఎండి పిలుపు నిచ్చారు. ఒకేసారిగా పెద్ద మొత్తంలో లభించే కష్టార్జిత సొమ్మును పొదుపుగా ఉపయోగించుకునేలా ఇటు ఉద్యోగులకూ అవగాహన కల్పించాలని ఏరియాల జిఎంల సమీక్ష సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సోమవారం జరిగిన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్దేశిత లక్షాలు సాధించే దిశగా పని చేసుకోవాలన్నారు.
రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి :
రాష్ట్ర విద్యుత్ అవసరాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించటం ఒక బృహత్తర బాధ్యతగా భావించి వచ్చే మార్చి చివరి కల్లా 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సిఎండి ఎన్. శ్రీధర్ ఆదేశించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో మెరుగైన బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించి నిర్దేశిత లక్ష్యసాధన దిశగా ముందుకెళ్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఏడు నెలల కాలంలో ప్రతి ఏరియా తనకు ఇవ్వబడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. మొత్తం 12 ఏరియాల్లో కొత్తగూడెం, మణుగూరు, రామగుండం-1, రామగుండం -2, రామగుండం -3 ఏరియాల పనితీరు బాగుందని ప్రశంసించారు. అలాగే ఇతర ఏరియాలు కూడా లక్ష్యాల మేర ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కొన్ని గనుల్లో మరింత ఉత్పత్తికి అవకాశం ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని సిఎండి శ్రీధర్ పిలుపునిచ్చారు.

అన్ని ఏరియాలలో ఓవర్ బర్డెన్ కు సంబంధించిన కాంట్రాక్ట్ లను ఖరారు చేయడం జరిగిందని ,కాంట్రాక్టర్ల నుండి లక్ష్యాల మేర ఓబీ తొలగింపుకు ఏరియాలో జనరల్ మేనేజర్లు మరింత శ్రద్ధ చూపాలన్నారు. సెప్టెంబరు నెలలో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.05 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని ఆదేశించారు. అలాగే 14.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించడానికి వీలుగా ఓబీ కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఓబీ లక్ష్యాలపై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలన్నారు. ప్రస్తుతం అడపా దడపా వర్షాల వల్ల ఉత్పత్తికి కొంత ఆటకం అయినప్పటికీ గనుల్లో నిలిచి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉత్పత్తికి విఘాతం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం) , ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి.వెంకటేశ్వర్ రెడ్డి (పి అండ్ పి), అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్(మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఈడీ(కోల్ మూమెంట్) , జె.అల్విన్, జీఎం(కోఆర్డినేషన్) ఎం.సురేష్, జీఎం(సీపీపీ) జక్కం రమేష్, జీఎం(ఎంపీ) మల్లెల సుబ్బారావు, జీఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, జీఎం(సీఎంసీ) మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News