Wednesday, January 22, 2025

రాజస్థాన్ సచివాలయంలో కోట్లలో నగదు, బంగారం లభ్యం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ సచివాలయం పనిచేసే యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో గల ఒక అలమారలో రూ.2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌బిఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించిన రోజే ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం విశేషం. యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌కు వెళ్లే అధికారం ఉన్న ఏడుగురు సచివాలయ ఉద్యోగులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అలమారలో భద్రపరిచిన ఒక సూట్‌కేసులో రూ.2,000, నైజ 500 కరెన్సీ నోట్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. సూట్‌కేసులోనే ఒక కిలో బంగారం కూడా ఉన్నట్లు వారు చెప్పారు. వెంటనే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అధికారులు తెలియచేశారు. రాత్రికిరాత్రే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉషా శర్మ, డిజిపి ఉమేష్ మిశ్రా, ఎడిజిపి దినేష్, జైపూర్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ సచివాలయంలో సంయుక్త విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఒక అలమారలో ఫైళ్లు లభించాయని, మరో అలమారలో సూట్‌కేసులో భద్రపరిచిన కరెన్సీ కట్టలు, బంగారం లభించాయని, వెంటనే ఉద్యోగులు ఈ విషయాన్ని అశోక్ నగర్ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందచేశారని ఆయన తెలిపారు. ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారని, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని శ్రీవాస్తవ చెప్పారు.
నగదు లభించిన అలమార చాలా ఏళ్లుగా మూతపడి ఉందని, ఆధార్‌తో సంబంధమున్న సిబ్బంది ఈ నగదు కనుగొన్నారని శ్రీవాస్తవ చెప్పారు.
కాగా..రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పనిచేసే సచివాలయం బేస్‌మెంట్‌లోపూ కోట్లాది రూపాయల నగదు, బంగారం లభించడం ప్రభుత్వ అవినీతికి తార్కాణమని అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు(బిజెపి) రాజేంద్ర రాథోర్ ఆరోపించారు. అంతమొత్తంలో నగదు, బంగారం అక్కడ ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News