హైదరాబాద్: రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం దేవుడిపై పడింది. ద్వారాకా, తిరుమల హుండీల్లో పెద్ద మొత్తంలో రూ. 2వేల నోట్లు దర్శనమిస్తున్నాయి. లెక్కింపులో రూ. 7లక్షల 76వేలు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. భక్తులు రూ. 2వేల నోట్లతో ప్రసాదాలు కొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికీ రద్దయిన 500, 1000 నోట్లు హుండీలో కట్టలు కట్టలుగా పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
రూ. 2000 నోటును మార్చుకునే ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30గా నిర్ణయించింది ఆర్‌బిఐ. ఆ తర్వాత నోట్లను సర్కులేషన్‌లో ఉంచొద్దని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. దేశంలో రూ. 3.52 లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ భావిస్తోంది. దేశంలో ఉన్న 19 ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్పుకునే అవకాశాన్ని కల్పించింది. కస్టమర్లకు రూ. 2వేల నోట్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని దేశంలోని బ్యాంకులను ఆర్‌బిఐ ఆదేశించిన విషయం తెలిసిందే.