ఆప్ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదల ను ప్రకృతి విపత్తుగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, వడదెబ్బ మృతులకు రూ. 20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ కన్వినర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చినా తెలంగాణ రాష్ట్రం లో 45-.47 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల నమోదు అవుతున్నందున ప్రభుత్వం యుద్దప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. వడదెబ్బతో ఇప్పటికే రాష్ట్రంలో వందమంది వరకు చనిపోయిన ట్లు తెలుస్తోందన్నారు. పాఠశాలలు కూడా అర్థరహితంగా ఈ ఎండల్లో రెండుపూటలా నడుపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్పరేషన్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో ఉష్ణోగ్రత ఉపశమన చర్యలు తక్షణ అవసరమని ఆయనన్నారు.
రోడ్ల పై ట్యాంకర్ల తో నీళ్ళు చల్లించడం, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లలో చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలని, అందుకు ప్రభుత్వం, అధికారులు ప్రజా ప్రతినిధులు,స్వచ్చంద సంస్థల సహాకారం తీసుకోవాలన్నారు. రుతుపవనాలు ఆలస్యం అవడం వల్ల ప్రజలకు హెచ్చరిక లు జారీ చేయడంతో పాటు, వడదెబ్బ కు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్త్రతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. పనికి ఆహార పథకం కూలీలు, భవన నిర్మాణ కార్మికుల పని ప్రదేశాలలో అధికారులు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఓఆర్‌డి పాకెట్ లు అందుబాటులో ఉంచాలని, పసిపిల్లలు ఉన్నవారిని ఈ పనులకు దూరంగా ఉంచాలని, అవసరమయితే తెల్లరేషన్ కార్డు దారులకు మరో పదికిలోల బియ్యం ఉచితంగా అందజేయాలని కోరారు. ఇంటిపైకప్పులపై కూలింగ్ సున్నం వేసుకునేలా సంభందిత వస్తువులు, మెటీరియల్ ప్రజలకు సరఫరా చేయాలన్నారు. వడదెబ్బకు ప్రజలు గురికాకుండా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపట్టాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.