ముంబయి: ఆరేళ్ల క్రితం వెయ్యి, రూ.500 నోట్ల రద్దు తర్వాత ప్రవేశ పెట్టిన రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్‌బిఐ) కీలక నిర్ణయం తీసుకొంది. మార్కెట్‌లో చెలామణిలో ఉన్న ఈ నోట్లను వెనక్కి తీసుకోవాలని శుక్రవారం నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్లను ఇవ్వొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయలేదని, వినియోగదారులు ఇప్పటికీ ఈ నోట్లను లావాదేవీలకోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా రూ.2 వేల నోట్లు ఉన్న వారు ఈ నెల 23నుంచి సెప్టెంబర్ 30 లోగా బ్యాంకులు, ఆర్‌బిఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని తెలియజేసింది.
బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా నోట్ల మార్పిడి ప్రక్రియను చేపట్టాలని బ్యాంకులకు ఆర్‌బిఐ సూచించింది. అయితే ఒక విడతలో గరిష్ఠంగా రూ.20 వేలను మాత్రమే మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు పరిమితిని మాత్రం ఆర్‌బిఐ పేర్కొనలేదు.నల్లధనాన్ని దాచుకునేందుకు ఈ పెద్ద నోటును ఉపయోగించుకుంటున్నారన్నఅనుమానాల నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ 2018 19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్లను ముద్రించడాన్ని ఆపేసింది. అంతేకాదు ఈ నోట్లు ఇప్పుడు చెలామణిలో పెద్దగా కనిపించడం లేదు కూడా.
2006లో హటాత్తుగా వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ అవసరాలను తీర్చుడం కోసం ఆ ఏడాది నవంబర్‌లో ఆర్‌బిఐ రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ నోటు చెలామణి ఎక్కువగానే ఉండింది. అయితే ఆ తర్వాత ఆర్‌బిఐ ఈ నోట్ల ముద్రణను ఆపేసింది. మరో వైపు క్రమంగా రూ.2 వేల నోట్లు చెలామణినుంచి మాయమవుతూ వచ్చాయి. దీంతో ఈ నోట్లను ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందని అప్పటినుంచి ఆర్థిక నిపుణులు భావిస్తూ వచ్చారు. ఇప్పుడు వారి భయమే నిజమైంది.
ఆర్‌బిఐ ప్రకటన
2017 మార్చి నాటికి చెలామణిలో ఉన్న నగదు మొత్తంలో రూ.2 వేల నోట్ల వాటా 89 శాతంగా ఉండిందని ఆర్‌బిఐ తన ప్రకటనలో తెలిపింది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన నోట్లు (37.3 శాతం)చెలామణిలో ఉన్నాయి. అయితే 2023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే చెలామణిలో ఉన్న మొత్తం నగదులో రూ.2 వేల నోట్ల వాటా 10.8 శాతానికి తగ్గిపోయిందని ఆర్‌బిఐ తెలిపింది. అయితే ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా తాజాగా రూ.2 వేల నోట్లను చెలామణినుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. అయితే రూ.2 వేల నోటును ప్రస్తుతం లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చని(లీగల్ టెండర్)స్పష్టం చేసింది. 2013 14లోనూ ఇదే తరహాలో సర్కులేషన్‌లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్న విషయాన్ని ఆర్‌బిఐ గుర్తు చేసింది. అప్పట్లో 2005కన్నా ముందు జారీ చేసిన నోట్లను ఆర్‌బిఐ వెనక్కి తీసుకొంది.
డీ మానిటేషన్ పరిస్థితి వస్తుందా?
కాగా రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంతో మరోసారి నోట్ల రద్దునాటి పరిస్థితి తలెత్తుతుందా అనే భయాలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి. అప్పట్లో రద్దయిన నోట్లను మార్చుకోవడానికి వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వందలాది మంది రోజూ బ్యాంకుల వద గంటలకొద్దీ ్ద పడిగాపులు కాశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందా అనేది వీరి భయం. అయితే అలాంటి పరిస్థితి తలెత్తకపోవచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా.ఆ రూ.2 వేల నోట్ల రద్ద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండక పోవచ్చని, రియల్ ఎస్టేట్ రంగంపైన మాత్రం కొంత వరకు ప్రభావం చూపించవచ్చని అంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే నల్లధనం వ్యాప్తిని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుని ఉంటుందని మరి కొందరు నిపుణులు అంటున్నారు.