రాష్ట్ర బడ్జెట్‌లో విద్య రంగానికి ప్రభుత్వం రూ. 23,108 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది (2024 -25) రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌లో విద్యకు రూ.21,292 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం రూ. 3,04,965 కోట్ల బడ్జెట్‌లో రూ.23,108 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి 7.57 శాతం నిధులు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో విద్యకు గత సంవత్సరం కంటే 1,816 కోట్లు(0.25 శాతం) అదనంగా కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయల అనుమతులు మంజూరు చేసినట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి, ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే, 550 కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలను చేపడుతున్నామని అన్నారు. ఈ బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ 19,464 కోట్లు, ఉన్నత విద్యకు రూ 3643 కోట్లు కేటాయించారు. గత ఏడాది పాఠశాల విద్యాశాఖకు రూ.17,946 కోట్లు కేటాయించగా,ఉన్నత విద్యకు రూ. 3350 కోట్లు కేటాయించారు.
విద్యారంగానికి ఏటా బడ్జెట్ కేటాయింపులు(కోట్లలో…)
ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ విద్యకు కేటాయింపు శాతం
2025- 26 రూ. 3,04,965 రూ.23,108 7.57
2024 25 రూ.2,91,159 రూ.21,292 7.31
2023 24 రూ.2,90,296 రూ.19,051 6.56
2022 23 రూ.2,56,958 రూ.16,043 6.24
2021 22 రూ.2,30,825 రూ.13,564 5.88
2020 21 రూ.1,46,492 రూ.12,127 6.63
2019 20 రూ.1,46,492 రూ.9,899 6.76
2018 19 రూ.1,74,453 రూ.13,278 7.61
2017 18 రూ.1,49,646 రూ.12,705 8.49
2016 17 రూ. 1,30,415 రూ.10,738 8.23
2015 16 రూ.1,15,689 రూ.11,216 9.69
2014 15 రూ.1,00,637 రూ.10,956 10.88
రాష్ట్రావతరణ నుంచి పాఠశాల విద్యకు బడ్జెట్ కేటాయింపులు
ఆర్థిక సంవత్సరం కేటాయింపులు (రూ. కోట్లల్లో)
2015- 16 రూ.8,561
2016 – 17 రూ.7,787
2017 -18 రూ.8,744
2018 -19 రూ.9,425
2019 -20 రూ.7,781
2020 -21 రూ.9,486
2021- 22 రూ.10,205
2022 -23 రూ.12,528
2023 -24 రూ.14,488
2024 -25 రూ.17,946
2025 26 రూ.23,108
విద్యారంగానికి నిరాశ మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ : టిఎస్‌యుటిఎఫ్
రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు తీవ్ర నిరాశకు గురిచేశాయని టిఎస్ యుటిఎఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత సంవత్సరం బడ్జెట్ కంటే 1816 కోట్లు పెరిగినప్పటికీ కేటాయింపులు ప్రభుత్వ విద్యారంగా బలోపేతానికి ఏమాత్రం సరిపోవని తెలిపింది.ఒకవైపు సాంకేతిక విద్య ఉన్నత విద్యారంగాలను బలోపేతం చేస్తామంటూ మొత్తం విద్యారంగాన్ని కలిపి కేవలం 7.57 కేటాయించడం శోచనీయం పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపు అనే హామీకి ఆమడ దూరంలో ఈ కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి జిల్లా పరిషత్, ప్రభుత్వ ,గిరిజన సంక్షేమ పాఠశాల అభివృద్ధికి నిధులు పెంచాలని టిఎస్‌యుటిఎఫ్ డిమాండ్ చేసింది.