రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయం, దాని అనుబంధరంగాలకు పెద్దపీట వేసి అన్నదాతలకు ఆలంబనగా నిలిచింది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్ల నిధులు కేటాయించి రైతన్నకు బడ్జెట్ లో భరోసా కల్పించింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధరంగాలు 17.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రైతు భరోసా, పంటరుణం మాఫీ, నీటిపారుదల ప్రాజెక్టలపై పెట్టుబడుల ద్వారా రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. వ్యవసాయరంగాన్ని పటిష్టవంతం చేసే దిశగా పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి వాటికి ప్రభుత్వం ప్రొత్సాహం కల్పించింది.రైతులకు రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12వేల చొప్పున రైతు భరోసా పథకానికి రూ.18వేల కోట్లు కేటాయించి రైతు భరోసా పథకానికి ఎటువంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. పశుసంవర్ధక శాఖకు బడ్జెట్‌లో రూ.1,674 కోట్లు ప్రతిపాదించారు. గత రబీ సీజన్ రైతు భరోసా నిధులను ఈనెల 31వ తేదీలోపే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసాను అందిస్తున్నది.
రైతు రుణమాఫీ
రైతాంగానికి ఇచ్చిన మాటలకు కట్టబడి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసింది. దీంతో రైతులు తిరిగి వ్యవసాయరుణాలు తీసుకోవడానికి సులువైంది. రుణాల మాఫీ వల్ల రాష్ట్రంలోని రైతుల ఆర్ధిక, సామాజిక స్తితగతులు మెరుగుపడేందుకు అవకాశం కలిగింది.
రైతు భరోసా
రైతుబరోసా పథకం అమలు కోసం రూ.18వేల కోట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రజాధనం దుర్వినియోగాన్ని నివారణ చర్యల్లో భాగంగా గత జనవరి 26వ తేదీన తెలంగాణ రైతు బరోసా పథకం ప్రారంభించింది. సాగుకు యోగ్యమైన భూములకు రైతుకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.12వేలు అందించేందుకు అవసరమైన నిధులను పొందుపరిచింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
భూమిలేని వ్యవసాయ కూలీలకు ఉపాధిలేని రోజుల్లో వారి కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు చెల్లించేందుకు ప్రతిపాదించారు.
సన్న వడ్లకు బోనస్
రైతులు పండించిన పన్న వడ్లకు క్వింటాలుకు రూ.500ల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం రూ.1,206.44 కోట్లు చెల్లించింది. దీంతో గత ఖరీఫ్‌లో సన్నవడ్ల సాగు విస్తీర్ణం 25లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తత ఆర్ధిక సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో 10,35,484 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు రూ.12,511.76 కోట్లు వారి ఖాతాలలో జమ చేసింది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో, ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తుంది.
వెటర్నరీ రీసెర్చ్ సెంటర్
హైదరాబాద్ శివారులోని మామిడిపల్లి వద్ద రూ.300కోట్లతో వెటర్నరీ బయాలాజికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్(విబిఆర్‌ఐ) విస్తరణకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త వ్యాక్స్న్లి ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనల కోసం రూ.100కోట్లతో ఆధునాతన యంత్రాలను కొనుగోలు చేయనున్నారు.
కోహెడలో ఫిష్ ఎక్స్‌పోర్ట్ యూనిట్
రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) సమీపంలోని కోహెడ వద్ద రూ.47కోట్ల వ్యయంతో ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ హోల్‌సేల్ షిప్ మార్కెట్ నిర్మాణానికి బడ్జెట్ ప్రతిపాదించింది.
సెమన్ బుల్ స్టేషన్
రంగారెడ్డి జిల్లా కంసాన్‌పల్లిలో రూ.21.06 కోట్ల వ్యయంతో ఫ్రోజెన్ సెమన్ బుల్ స్టేషన్ నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రాష్ట్రంలో మేలుజాతి పాడిపశువులను వృద్ధి చేయడానికి దోహదం చేస్తుంది.