హైదరాబాద్: గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.250 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సార్వత్రి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామారావు తెలిపారు. ఈ నెల 28న వర్సిటీ 25వ స్నాతకోత్సవం సందర్భంగా సీతారామారావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాలు విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాలలో సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పదో షెడ్యూల్ ప్రకారం జూన్-2024తో ఎపితో సంబంధాలు తెగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ సిబ్బంది జీతాలు, నిర్వహణకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదన్నారు.
స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై, యుజిసి ఆచార్యులు జగదీశ్ కుమార్ హాజరవుతున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సీతారామారావు పేర్కొన్నారు. 2019-22 సంవత్సరానికి గాను డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులో మొత్తం 31,729 మంది ధ్రువపత్రాలు స్వీకరించనున్నారని తెలిపారు. ఐదు ట్రాన్స్‌జెండర్లు సైతం డిగ్రీ పట్టాలు అందుకుంటారని, 43 మందికి బంగారు పతకాలు అందిస్తుండగా, ఇందులో 32 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వివిధ కేంద్ర కారాగారాల నుంచి ఈ సారి 148 మంది ఖైదీలు డిగ్రీ, పిజీల్లో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఖైదీలలో ఒకరు బంగారు పతకం ఆందుకోనున్నారని వివరించారు. యంగిలిశెట్టి శ్రీరాములు అనే విద్యార్థి మూడు బంగారు పతకాలు సాధించారని విసి పేర్కొననారు. అంబేడ్కర్ వర్సిటీ పూర్వ విసి ఆచార్య విఎస్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.