పాక్ నౌక నుంచి పట్టుబడిన రూ. 25 వేల కోట్ల మాదక ద్రవ్యాలు
ఇందులో ఉన్నదంతా అత్యంత హానికరమైన మెథాంఫెటమిన్
బోట్లపై పారిపోతున్న ముఠాను వెంబడించిన నేవీ సాహసోపేత చర్య
కొచి: పాకిస్థాన్ కేంద్రంగా భారీ ఎత్తున సాగుతున్న కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల రవాణాను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఇండియన్ నేవీ బృందాలు సమష్టి వ్యూహంతో భారత సాగర జలాల్లో పట్టుకోగలగడం సంచలనాత్మకమైంది. ఈ దాడి యావత్తు సాహసోపేతంగా సాగింది. శనివారం సాగిన ఈ దాడిలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీమ్ ఈ డ్రగ్ మాఫియా సామ్రాజ్యాన్ని సాగిస్తున్నాడు. శనివారం సాగర జలాల్లో పట్టుబడిన 2525 టన్నుల బరువున్న ఈ మాదక ద్రవ్యాల ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.25,000 కోట్ల విలువ ఉంటుందని, ఎంత లేదనుకున్నా కనీసం రూ.15.000 కోట్ల విలువ ఉంటుందని ఇది అత్యంత నాణ్యమైన రకం అని ఎన్‌సిబి ప్రాథమిక అంచనా వేసింది.
పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ కు చెందిన జివానీ రేవు దగ్గర దీని మూలాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్‌లో పాక్ జాతీయుడిగా అనుమానిత వ్యక్తి ఎన్‌సిబి పట్టుకుంది. నిందితుడిని ప్రశ్నించిన తరువాత కొచి లోని మట్టన్ చెర్రీ కోర్టులో సోమవారం హాజరు పరిచారు. పట్టుబడిన మాదకద్రవ్యాల గుట్టలను మట్టన్‌చెర్రీ రేవు దగ్గరకు తీసుకొచ్చారు. సాగర జలాల్లో ఎవరికీ తెలియని చోట మదర్ షిప్‌గా ఏజెనీ వ్యవహరించే ఒక నౌక నుంచి ఈ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగలిగారు. అయితే ఇంతకీ ఆ నౌకకు ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. ఎన్‌సిబి, నేవీ బృందాలు తమను పట్టుకుంటాయన్న భయంతో ఆ నౌకపై ఉన్న వారు తప్పించుకునే ముందు నౌకను సముద్రంలో ముంచి వేయాలని యత్నించారు.
నౌక నుంచి తప్పించుకుని పారిపోతున్న నిందితుల ముఠాను పట్టుకోడానికి నేవీ గట్టిగా ప్రయత్నించింది. సముద్రంలో పారబోసే మాదక ద్రవ్యాలను నేవీ స్వాధీనం చేసుకోగలిగింది. నౌకను పట్టుకున్న తరువాత ముఠా బోట్ల ద్వారా తప్పించుకోడానికి ప్రయత్నించారు. ఆ బోట్లలో ఒకదాన్ని నేవీ బృందం వెంటాడి అందులోని పాక్ జాతీయుడ్ని పట్టుకోగలిగింది. పట్టుబడిన మాదక ద్రవ్యాలు మెథాంపెటమిన్ (క్రిస్టల్ మెథ్)కు చెందినవి. వీటి ద్రవ్య విలువ మార్కెట్ లో కొన్ని వేల కోట్లు. ఇవి రవాణా అవుతున్నట్టు క్లూ దొరకడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్థాన్ లోని మూడు ల్యాబ్‌లు వీటిని తయారు చేస్తున్నాయని అధికారులు నిర్ధారించారు. మాదకద్రవ్యాల సంచులపై మూడు రకాల చిహ్నాలు కనిపించాయి. సముద్ర జలాల్లో నిల్వ చేయడానికి వీలుగా చాలా తెలివిగా వీటిని ప్యాక్ చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.