Monday, December 23, 2024

రూపే, యుపిఐ లావాదేవీలకు రూ.2600 కోట్ల ప్రోత్సాహకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రూపే డెబిట్ కార్డ్‌లు, తక్కువ విలువ కల్గిన భీమ్‌యుపిఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర కేబినెట్ రూ.2,600 కోట్ల పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపే, యుపిఐలను వినియోగించి పాయింట్ ఆఫ్ సేల్(పిఒఎస్), ఇకామర్స్ లావాదేవీలను ప్రోత్సహిస్తారు, దీనికి గాను బ్యాంకులు ప్రోత్సాహకాలు అందిస్తాయి. బుధవారం తీసుకున్న కేబినెట్ నిర్ణయాలతో సామాన్య ప్రజలకు ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ లావాదేవీల్లో వెసులుబాటు లభించడంతో పాటు ప్రోత్సాహకాలు అందుతాయి.

కేంద్ర మంత్రివర్గం సుమారు రూ.2600 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీని కింద ప్రజలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూపే డెబిట్ కార్డ్, భీమ్ యుపిఐ వినియోగానికి ప్రోత్సాహకాలను పొందుతారు. పి2ఎం (వ్యక్తి నుండి వ్యాపారి) ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఇస్తారు. కేబినెట్ మంత్రి భూపేంద్ర యాదవ్ మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,600 కోట్ల ప్రోత్సాహకాల కింద ఎంఎస్‌ఎంఇలు, రైతులు, కార్మికులు, పరిశ్రమలు భీమ్ యుపిఐ చెల్లింపులకు అర్హులుగా ఉంటారు. వారికి కొంత రాయితీ లభిస్తుంది. డిజిటల్ చెల్లింపులను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

రూపే కార్డ్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు

రూపే కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపులపై 0.4 శాతం ప్రోత్సాహకం అందించనున్నట్లు భూపేంద్ర యాదవ్ తెలిపారు. భీమ్ యుపిఐ ద్వారా రూ. 2,000 కంటే తక్కువ లావాదేవీలపై 0.25 శాతం ప్రోత్సాహకం ఇస్తారు. బీమా, మ్యూచువల్ ఫండ్స్, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర విభాగాల వంటి పరిశ్రమల కోసం యుపిఐ ద్వారా డిజిటల్ చెల్లింపులకు ఈ ప్రోత్సాహకం 0.15 శాతంగా నిర్ణయించారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ప్రకారం, బ్యాంకులకు కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తారు. దీని ద్వారా ప్రజలు రూపే కార్డ్ ద్వారా జరిగే పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్), ఇ-కామర్స్ లావాదేవీలపై ప్రోత్సాహకాలను పొందగలుగుతారు. డిసెంబర్‌లో యుపిఐ చెల్లింపుల ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశ మొత్తం జిడిపిలో 54 శాతం అని భూపేంద్ర యాదవ్ చెప్పారు. దీన్ని మరింత పెంచేందుకు ఈ రూ.2600 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

మూడు కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ఆమోదం

దేశవ్యాప్తంగా మూడు కొత్త కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. ఆర్గానిక్ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు గానూ కొత్త సొసైటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News