కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు అధిక ప్రాధాన్యత లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలపై కరుణించారు. కిందటి ఏడాదితో పోల్చితే ఈసారి అదనంగా రూ.351.98 కోట్లను అదనంగా కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను క్రీడలకు రూ.3,794 కోట్లను ఖరారు చేశారు.కిందటి కేంద్ర బడ్జెట్‌లో రూ.3,442 కోట్లను మంజూరు చేశారు. ఈసారి క్రీడల బడ్జెట్‌ను భారీగా పెంచారు. స్పోర్ట్ కేటాయించిన బడ్జెట్‌లో ఖేలో ఇండియాకు ఎక్కువ నిధులను ఇచ్చారు. ఈ ఏడాది అదనంగా రూ.200 కోట్లను కేటాయించారు. దీంతో ఖేలో ఇండియాకు ఇచ్చిన నిధులు రూ.1000 కోట్లకు చేరాయి.
క్షేత్ర స్థాయిలో ఉండే యువ క్రీడాకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు జాతీయ క్రీడల సమాఖ్యకు ఇచ్చే నిధులను కూడా కేంద్రం పెంచింది. ఈసారి సమాఖ్యకు అదనంగా రూ. 60 కోట్లను మంజూరు చేసింది. దీంతో క్రీడల సమాఖ్య బడ్జెట్ రూ.400 కోట్లకు చేరింది. ఇక యువతను సామాజిక కార్యక్రమాలు, ప్రజా సేవలో భాగం చేసుందుకు అమలు చేస్తున్న నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్)కు కేటాయించే బడ్జెట్‌ను ఏకంగా రూ.200 కోట్లను పెంచింది. దీంతో ఎన్‌ఎస్‌ఎస్ స్కీమ్ బడ్జెట్ రూ.450 కోట్లకు చేరింది. కాగా, రానున్న రోజుల్లో భారత్‌లో విశ్వ క్రీడలు ఒలింపిక్స్ నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.