న్యూఢిల్లీ: గత ఏడేళ్లలో దేశం నుంచి రూ.38,000 కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. వైమానిక, రక్షణరంగాల్లో రూ.85,000 కోట్ల ఉత్పత్తులపై అంచనాలున్నాయని, ప్రైవేట్ సెక్టార్ నుంచి రూ.18,000 కోట్ల అంచనాలున్నాయని రాజ్‌నాథ్ అన్నారు. శనివారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఇ) ఆధ్వర్యంలో నిర్వహించిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్షరర్స్(ఎస్‌ఐడిఎం) కాన్‌క్లేవ్‌లో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా దేశ రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుందని ఎంఎస్‌ఎంఇలకు రాజ్‌నాథ్ సూచించారు. ‘మీరు నూతన సాంకేతికతలు, ఉత్పత్తులు తేగలరు. మీరు చిన్నవాళ్లుగా భావించుకొని పెద్ద ఆవిష్కరణలు సాధ్యం కావని అనుకోవద్దు’ అంటూ రాజ్‌నాథ్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. ప్రభుత్వ చొరవతో రక్షణ పరిశ్రమలోకి దాదాపు 12,000 ఎంఎస్‌ఎంఇలు చేరాయని రాజ్‌నాథ్ తెలిపారు. రక్షణ రంగంలో స్టార్టప్‌ల సంఖ్య పెరిగిందన్నారు. రక్షణ ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు రక్షణ పరికరాల దిగుమతిదారుగా ఉన్న దేశం ఇకనుంచి ఎగుమతిదారుగా మారుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Rs 38000 cr defence items exports in 7 years: Rajnath Singh